సత్తార్ బేగ్ (ఫైల్), షమీ బేగ్ (ఫైల్)
మార్కాపురం: మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి వద్ద సుదీర్ఘకాలం పీఏగా పని చేసిన రిటైర్డు ఎంపీడీవో మొఘల్ సత్తార్ బేగ్ (70), ఆయన కుమారుడు షమీబేగ్ (40)లు శనివారం వేకువ జామున మృతి చెందారు. కొన్ని రోజులుగా షమీబేగ్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మృతి చెందాడు. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న తండ్రి సత్తార్ బేగ్ తట్టుకోలేక కుప్పకూలిపోయాడు. కాసేపటికే ఆయన కూడా ప్రాణాలు విడవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. తండ్రీకొడుకుల మృతి వార్త తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి, ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు షేక్ ఇస్మాయిల్, బుశ్శెట్టి నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సహాయ కార్యదర్శి మీర్జా షంషీర్ అలీబేగ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు చిర్లంచర్ల బాలమురళీకృష్ణలు నివాళులరి్పంచారు. సత్తార్‌బేగ్ సుమారు 20 ఏళ్ల పాటు కొండారెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. ప్రభుత్వ కార్యకలాపాల్లో విశేష అనుభవం ఉంది. రిటైర్డు పెన్షనర్ల సంఘానికి ఆయన తన సేవలు అందించారు. పలువురు ముస్లిం నాయకులు తండ్రి, కొడుకుల మృతిపై సంతాపం తెలిపారు.
ఆ కుటుంబంలో విషాదం
కొడుకు మరణ వార్త విని తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి కూడా చనిపోవటంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రిటైర్డు ఎంపీడీవోగా, మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డికి వ్యక్తిగత కార్యదర్శిగా మొగల్ సత్తార్‌బేగ్ మార్కాపురం, తర్లుపాడు, యర్రగొండపాలెం, పెద్దారవీడు, పెద్దదోర్నాల, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాల ప్రజలకు సుపరిచితుడు. ఆయన వివిధ మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగిగా పని చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రెండో కుమారుడైన షమీవుల్లాబేగ్ (40) వారం కిందట అనారోగ్యానికి గురై ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందాడు. ఆ వార్తను కుటుంబ సభ్యులు తండ్రి సత్తార్‌బేగ్ (70)కు చెప్పడంతో ఆయన కుప్పకూలి గుండెపోటుతో మరణించారు. దీంతో సత్తార్‌బేగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. షమీవుల్లాకు కుమారుడు పర్హాన్, కుమార్తె పైజా ఉన్నారు. ఇద్దరూ చిన్న పిల్లలే. ఒక వైపు తండ్రి మరణం, మరో వైపు తాత మరణంతో ఇద్దరి మృతదేహాలను చూస్తూ రోదించిన తీరు పలువురిని కంట తడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment