Jagananna Vidya Deevena: నేడు జగనన్న ‘విద్యాదీవెన’ | Fee Reimbursement first installment will be deposited by the AP Govt | Sakshi
Sakshi News home page

Jagananna Vidya Deevena: నేడు జగనన్న ‘విద్యాదీవెన’

Published Mon, Apr 19 2021 2:40 AM | Last Updated on Mon, Apr 19 2021 10:51 AM

Fee Reimbursement first installment will be deposited by the AP Govt - Sakshi

సాక్షి, అమరావతి: పేద విద్యార్థుల్ని కూడా పెద్ద చదువులు చదివించాలన్న సమున్నత లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూపకల్పన చేసిన ‘జగనన్న విద్యాదీవెన’ పథకం కింద 2020–21 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొదటి విడత నగదును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందించనుంది. వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను జగనన్న విద్యాదీవెన కింద ప్రతి విద్యా సంవత్సరంలో నాలుగు విడతలుగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా జమ చేయనున్నారు. 

10,88,439 మంది విద్యార్థులకు..
మొదటి విడత కింద 10,88,439 మంది విద్యార్థులకు సంబంధించిన రూ.671.45 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇందుకోసం ఆర్థిక శాఖతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖలు రూ.671.45 కోట్లను విడుదల చేస్తూ ఆదివారం జీవోలు జారీ చేశాయి. బీసీ సంక్షేమ శాఖ రూ.491.42 కోట్లను జగనన్న విద్యాదీవెన మొదటి విడత కోసం విడుదల చేసింది. ఇందులో బీసీ విద్యార్థులతో పాటు ఈబీసీ, కాపు విద్యార్థులు ఉన్నారు. ఎస్సీ విద్యార్థుల కోసం ఎస్సీ సంక్షేమ శాఖ రూ. 119.25 కోట్లు, ఎస్టీ విద్యార్థుల కోసం ఎస్టీ సంక్షేమ శాఖ రూ.19.10 కోట్లు, మైనారిటీ సంక్షేమ శాఖ రూ.41.68 కోట్లు విడుదల చేసింది.

బకాయిలు లేకుండా త్రైమాసిక చెల్లింపులు
గత టీడీపీ ప్రభుత్వం అరకొర ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పథకాన్ని నీరుగార్చడమే కాకుండా పెద్దఎత్తున బకాయిలు పెట్టింది. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన వారందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బకాయిలు లేకుండా నాలుగు విడతల్లో ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికంలోనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా 2020–21 విద్యా సంవత్సరంలో మొదటి విడత ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సోమవారం చెల్లిస్తుండగా.. రెండో విడత జగనన్న విద్యాదీవెన ఈ ఏడాది జూలైలో, మూడో విడత ఈ ఏడాది డిసెంబర్‌లో, నాలుగో విడత నిధులను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చెల్లించనున్నారు.

టీడీపీ హయాంలో బకాయిలు రూ.1,880 కోట్లు చెల్లింపు
గత టీడీపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకుండా బకాయి పెట్టిన రూ.1,880 కోట్లను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెల్లించారు. దీంతోపాటు ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.4,207.85 కోట్ల మేర విద్యార్థులకు లబ్ధి కలిగింది. సోమవారం చెల్లించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో కలుపుకుంటే మొత్తం రూ.4,879.30 కోట్లను విద్యార్థుల పెద్ద చదువులకు ప్రభుత్వం వ్యయం చేసినట్లువుతుంది.

తల్లుల ఖాతాల్లోనే ఎందుకంటే
► పిల్లలు చదువుతున్న కాలేజీలకు తల్లిదండ్రులు స్వయంగా వెళ్లి ఫీజులు కట్టడం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఆ కాలేజీల్లో సమస్యలు, వాటిలో ఉన్న పరిస్థితులు, సదుపాయాలు, అక్కడ తమ పిల్లల బాగోగులు గురించి తెలుసుకుని వసతుల లోపంతో పాటు సమస్యలేమైనా ఉంటే కాలేజీల యాజమాన్యాలను ప్రశ్నించగలుగుతారు.
► కాలేజీల్లోని సమస్యలను 1902 నంబర్‌కు ఫోన్‌ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ కాలేజీల్లో పరిస్థితులను చక్కదిద్ది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది.
► కాలేజీల్లో జవాబుదారీతనం, కాలేజీల్లో స్థితిగతులు, పిల్లల బాగోగులపై తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది.
► తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన వారం, పది రోజుల్లో కాలేజీలకు వెళ్లి ఫీజు చెల్లించాలి. ప్రభుత్వం విడుదల చేసిన ఫీజును కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడత ఫీజు చెల్లింపు నిలుపుదల చేస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement