
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) శుక్రవారం విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో నిర్ణాయక శక్తిగా అవతరించారు. జనవరి 15 నాటికి రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,05,08,222 (సర్వీస్, ఎన్నారై ఓటర్లతో కలిపి) ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ ప్రకటించారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య 2,00,30,486 ఉండగా, మహిళా ఓటర్ల సంఖ్య 2,04,73,601గా నమోదైంది. రాష్ట్రంలో పురుషుల కంటే 4,43,115 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 4,135.. సర్వీస్ ఓటర్లు 66,844, ఎన్నారై ఓటర్లు 7,070 మంది ఉన్నారు.
నవంబర్ 11న విడుదల చేసిన ముసాయిదా జాబితాతో పోలిస్తే ఓటర్ల సంఖ్య 3,62,353 పెరిగింది. ముసాయిదా జాబితా తర్వాత 4,25,860 మంది కొత్త ఓటర్లు నమోదు కాగా, 63,507 మందిని తొలిగించారు. తుది ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో గతంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 45,836 ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 45,917కి చేరింది. రాష్ట్ర జనాభాలో ప్రతి 1,000 మంది జనాభాకు 752 మంది ఓటర్లుగా నమోదయ్యారు. ఓటర్ల సంఖ్యలో 18 నుంచి 19 ఏళ్ల మధ్యలో ఉన్న వారి సంఖ్య 2,83,301గా ఉంది. నవంబర్‌లో ప్రకటించిన ముసాయిదా జాబితాపై డిసెంబర్ 15 వరకు అభ్యంతరాలను స్వీకరించి, పరిశీలన అనంతరం జనవరి 15న తుది జాబితా ఎస్‌ఎస్‌ఆర్–2021ను విడుదల చేసినట్లు ఎస్‌ఈసీ పేర్కొంది. తుది జాబితాను జిలాల్ల వారీగా రాజకీయ పార్టీలకు డీఈవో/ఈఆర్‌వోల ద్వారా ఇస్తామని, సీఈవో వెబ్‌సైట్‌లో కూడా అప్‌లోడ్ చేశామని పేర్కొంది.