నెల్లూరు (సెంట్రల్): ఆగస్టు 9 నుంచి నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కలెక్టర్ చక్రధర్‌బాబు, ఎస్పీ విజయారావు, కమిషనర్ జాహ్నవి, మేయర్ స్రవంతితో కలిసి వివిధ శాఖలతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండేళ్లుగా కరోనా కారణంగా రొట్టెల పండగను నిర్వహించ లేకపోయామన్నారు. ఈ ఏడాది రొట్టెల పండగను ప్రతిష్టాత్మకంగా చేయాలన్నారు. జిల్లాలోని అన్ని శాఖల అధికార యంత్రాంగాన్ని భాగస్వాములను చేద్దామన్నారు. ఈ ఏడాది భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నందున ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు పోవాలన్నారు.
గత అనుభవాలు, లోపాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రధానంగా వైద్యం, మంచి నీరు, టాయిలెట్స్, విద్యుత్, పారిశుధ్యం, పోలీసులు సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ దఫా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంతో ప్రఖ్యాతి పొందిన ఈ రొట్టెల పండగను అందరం గర్వించేలా చేసుకుందామన్నారు. రెండేళ్ల తర్వాత నిర్వహించే ఈ పండగకు గతంలో కంటే లక్షల సంఖ్యలో అధికంగా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వాటిని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ పండగలో కులమతాలకు అతీతంగా భక్తులు పాల్గొంటారని, అందుకు తగినట్లు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. బడ్జెట్ విషయంలో రాజీలేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
ఈ ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతున్నారని, ముస్లిం మతపెద్దల సూచనల మేరకు రొట్టెల పండగ పూర్తి చేసుకున్న తర్వాత చేస్తామన్నారు. కలెక్టర్ చక్రధర్‌బాబు మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు ముందుగా సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఏర్పాట్లలో ఎక్కడా ఎటువంటి చిన్న పొరపాటు, లోపాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అటువంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా ఏర్పాట్లు ఉండాలన్నారు.
పండగ ముందు నుంచి ముగిసే వరకు అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటూ నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. ఎస్పీ విజయారావు మాట్లాడుతూ పోలీసు శాఖ నుంచి ఎక్కడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. ప్రధానంగా ఈ పండగను గతంలో నిర్వహించిన అనుభవం ఉన్న అధికారులను కూడా ఉన్నతాధికారుల అనుమతితో ఇక్కడకు తీసుకువస్తామన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమరాలు ఏర్పాటు, పార్కింగ్, శాంతిభద్రతలకు ఎక్కడా విఘాతం కలుగకుండా ఉండే అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ ఖలీల్‌అహ్మద్, పలువురు మతపెద్దలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment