సాక్షి, అమరావతి: కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన కొల్లు శ్రీవాసవి ప్రవళిక, కొల్లు ఉమాశంకర్ అక్కాతమ్ముళ్లకు సీఎం సహాయ నిధి నుండి రూ.10 లక్షల చెక్కులను హోం మంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అందజేశారు. కొవ్వూరులోని హోం మంత్రి కార్యాలయంలో ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున రెండు చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు.
కాగా.. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని జండా పంజా రోడ్డులో నివాసం ఉంటున్న కొల్లు శ్రీ వాసవి ప్రవళిక, ఉమాశంకర్‌లు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే తమ తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయారు. 2021లో కరోనాతో తండ్రి కొల్లు శ్రీనివాసరావు(47) జూన్ 5 న మరణించగా, తల్లి కొల్లు శ్యామల(41) జూన్ 9న మృతి చెందారు. ప్రస్తుతం అమ్మమ్మ ఇంట్లో ఉంటున్న అక్క తమ్ముళ్లకు సీఎం సహాయ నిధి ద్వారా సాయం అందించారు. తల్లిదండ్రులను ఇద్దర్నీ ఒకేసారి కోల్పోయి తీవ్ర మనోవేదనలో ఉన్న తమకు ధైర్యాన్ని, భవిష్యత్ పట్ల నమ్మకాన్ని కలిగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హోం మంత్రి తానేటి వనితలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి సాయం అందించడానికి హోం మంత్రి చేసిన కృషి, చొరవ ఎప్పటికీ మరువలేనిదని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమం కోసం, ఆపద కాలంలో వారికి అండగా ఉండడం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల వారికి అందజేస్తున్నామని తెలిపారు. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం జగన్ అహర్నిషలు కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ఎందరో అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలిచి బతుకుపై భరోసానిచ్చిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment