ఏలూరు టూ టౌన్/ఏలూరు టౌన్: ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్‌లో శనివారం రాత్రి రైల్వే ట్రాక్ మెషిన్ సిబ్బంది ప్రయాణించే రైలు బోగీ అగ్ని ప్రమాదానికి గురైంది. దీనిని రైల్వే లైన్ మరమ్మతుల కోసం ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులు, అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రాక్ మరమ్మతుల కోసం వినియోగించే ఈ బోగీని ఏలూరు రైల్వేస్టేషన్ ట్రాక్ నంబర్ 7లో చివర లూప్‌లైన్‌లో నిలిపి ఉంచారు. రాత్రి 7.30–8 గంటల మధ్య ఈ బోగీకి మంటలు అంటుకుని ఎగసిపడ్డాయి.
అప్రమత్తమైన రైల్వే అధికారులు ఏలూరు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ ఆధ్వర్యంలో రెండు ఫైర్ ఇంజిన్లు అక్కడకు చేరుకుని అదుపు చేశాయి. బోగీలో నిల్వ ఉంచిన 10 వరకు ఆయిల్ డ్రమ్ములను బయటకు లాగి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. వీటికి నిప్పు అంటుకుని ఉంటే అదుపు చేయడం కష్టమయ్యేది. ఆ బోగీలో విలువైన బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వైర్లు, ట్రాక్ మరమ్మతులకు వినియోగించే సామగ్రి, కూలర్ వంటివి బయటికి తీసుకొచ్చారు.
షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం
రైల్వే ఇంజనీరింగ్ విభాగానికి చెందిన క్యాంపింగ్ కోచ్ ఫర్ ట్రాక్ మెషిన్ సిబ్బంది ప్రయాణించే ప్రత్యేక రైలు బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ఏలూరు అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ రామకృష్ణ చెప్పారు. శనివారం విపరీతమైన వేడి ఉండటం వల్ల అందులోని వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి అగ్ని ప్రమాదం జరిగిందని మీడియాకు చెప్పారు.
ఈ రైలు బోగీలో రైల్వే సిబ్బందితో పాటు డీజిల్ ట్యాంకులు, యంత్ర పరికరాలు ఉంటాయన్నారు. పక్క బోగీలోనే భారీగా డీజిల్ నిల్వలు ఉన్నాయన్నారు. మంటలు వ్యాప్తి చెందక ముందే అదుపు చేశామని చెప్పారు. బోగీలోని 15 మంది సిబ్బందికి ఎలాంటి ఇబ్బంది కలగలేదని వివరించారు. ఆస్తి నష్టం అంచనా వేయాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment