ప్రతీకాత్మక చిత్రం
రాజవొమ్మంగి: జీలుగ కల్లు తాగిన ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. ఈ విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలోని రాజవొమ్మంగి మండలం లోదొడ్డి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన చదల సుగ్రీవ(70), బూసరి సన్యాశిరావు(65), పొత్తూరి గంగరాజు(35), వేమా లోవరాజు(28), కుడే ఏసుబాబు(23), గంగరాజు తండ్రి వెంకటేశ్వర్లు రోజూ మాదిరిగానే బుధవారం ఉదయాన్నే తమకు సమీపంలోని జీలుగ చెట్టు నుంచి కల్లు సేకరించారు. సుగ్రీవ, సన్యాశిరావు, గంగరాజు, లోవరాజు, ఏసుబాబు దానిని తాగగా.. వెంకటేశ్వర్లు కల్లు నుంచి దుర్వాసన వస్తోందని ఉమ్మేశాడు.
కల్లు తాగిన ఐదుగురూ కొద్దిసేపటికే వాంతి చేసుకొని.. అపస్మారక స్థితికి చేరుకున్నారు. బాధితులను అంబులెన్స్‌లో కాకినాడకు తరలిస్తుండగా మార్గంమధ్యలో ఇద్దరు, కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి చెందారు. కల్లులో కావాలని ఎవరో విషం కలిపి ఉంటారని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. కల్లును పరిశీలించిన రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్ పటేల్ అందులో క్రిమి సంహారక మందు కలిసినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిపారు. శాంపిల్స్ సేకరించి కాకినాడ ల్యాబ్‌కు పంపించినట్లు ఎస్‌ఈబీ సీఐ ఎ.ఆనంద్ తెలిపారు.
బాధితులకు ప్రభుత్వం అండ..
బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండి.. ఆదుకుంటుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి చెప్పారు. మృతుల కుటుంబాల పరిస్థితిని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వారిని తప్పకుండా ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment