పుంగనూరులో టీడీపీ నేతల అరాచకం
అధికారులకు బాధిత మహిళల ఫిర్యాదు
న్యాయం చేయకపోతే ఆత్మహత్యే దిక్కంటూ ఆవేదన
పుంగనూరు: అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులపై టీడీపీ నేతల అరాచకాలు మరింతగా పెరిగిపోయాయి. ముఖ్యంగా దళితులు, గిరిజనులపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్నారు. తాజాగా సోమవారం చిత్తూరు జిల్లా పుంగనూరులో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో ఎస్సీ, ఎస్టీ మహిళలు వేసుకున్న పునాదులను టీడీపీ నాయకులు జేసీబీలతో పెకిలించారు. దీంతో బాధితులు మల్లీశ్వరి, ఈశ్వరమ్మ, లలిత తదితరులు మంగళవారం మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు.
వారు చెప్పిన వివరాల ప్రకారం.. 2010లో అప్పటి ప్రభుత్వం పేదలకు పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. కానీ సదరు స్థలం తమదంటూ భాస్కర్ అనే వ్యక్తి గొడవలు చేయడం మొదలుపెట్టాడు. భాస్కర్, ఇస్మాయిల్, సర్దార్ అనే ముగ్గురు కోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. దీనిపై పట్టాదారులు జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. ఇదిలా కొనసాగుతుండగా.. టీడీపీ నాయకులు, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి పోలీసుల సాయంతో సోమవారం జేసీబీలను ఉపయోగించి ఆ పునాదులను పూర్తిగా పెకిలించేశారు.
బాధిత కుటుంబాలు అడ్డుకునేందుకు ప్రయత్ని0చగా.. అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై బాధితులు కలెక్టర్‌కు, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని.. తమ స్థలాలు తమకు ఇప్పించాలని కోరారు. లేకపోతే ఆత్మహత్య తప్ప తమకు మరో దిక్కు లేదంటూ విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment