జనవరి 10, 11, 12 తేదీలకు 1.20 లక్షల సర్వదర్శనం టోకెన్లు
జనవరి 9న జారీ... టోకెన్లు లేకుంటే దర్శనం లేనట్లే
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుపతి, తిరుమలలో సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. జనవరి 10, 11, 12 తేదీలకు సంబంధించి జనవరి 9న ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు ఇస్తామని, తదుపరి రోజులకు ఏరోజుకారోజు ముందురోజు టోకెన్లు జారీచేస్తామని ఈవో తెలిపారు.
ఇందుకోసం తిరుపతి, తిరుమలలో కౌంటర్లు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని 8 కేంద్రాల్లో 87 కౌంటర్లు, తిరుమలలో 4 కౌంటర్లు కలుపుకుని మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులు తమ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, టోకెన్లు పొందిన భక్తులకు ఈసారి వారి ఫొటో గుర్తింపుతో కూడిన స్లిప్‌లను జారీచేస్తామని తెలిపారు.
టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజుల్లో శ్రీవారి దర్శనం ఉండదని స్పష్టం చేశారు. తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న కౌంటర్ల కేంద్రాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో గౌతమి, జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు, సీవీఎస్‌వో శ్రీధర్‌తో కలిసి ఈవో తనిఖీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment