
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం.. మొత్తం 5 పాత జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో మొత్తం రూ.6,290 కోట్లతో కొత్త మంచినీటి పథకాల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఆయా పనులకు సంబంధించిన ప్రతిపాదనలపై బుధవారం నుంచి 10 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించనున్నట్టు గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్) ఈఎన్‌సీ కృష్ణారెడ్డి తెలిపారు. పనుల ప్రతిపాదనల వివరాలను జ్యుడిషియల్ ప్రివ్యూ అధికారిక వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంచారు.
వాటర్ గ్రిడ్ పథకంలో ఆయా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే 30 ఏళ్ల కాలంలో పెరిగే ప్రజా అవసరాల దృష్ట్యా కొత్తగా మంచినీటి పథకాలను ప్రభుత్వం నిర్మించబోతోంది. ఏడాది మొత్తం ఆయా పథకాలకు నీరు అందుబాటులో ఉండేలా ముందస్తుగా ప్రత్యేక జాగ్రత్తలను ప్రభుత్వం తీసుకుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని సముద్ర తీరప్రాంతంలో రూ.1,650 కోట్లతో, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని సముద్ర తీరప్రాంతంలో రూ.1,400 కోట్లతో ప్రభుత్వం కొత్తగా మంచినీటి పథకాల నిర్మాణం చేపడుతుంది. కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతంలో రూ.750 కోట్లతో, కొత్తగా ఏర్పడిన పల్నాడు జిల్లాలో రూ.1,200 కోట్లతో, ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో కొత్తగా మంచినీటి పథకాల నిర్మాణం చేపడుతున్నారు.