
పార్వతీపురం మన్యం జిల్లాలోని బంగారువలసలో ప్రజలతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం రాజన్నదొర
సాక్షి, నెట్‌వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శనివారం అపూర్వ స్పందన లభించింది. కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులకు ప్రజలు ఎదురేగి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, అవి తమకు అందుతున్నాయని, సీఎం వైఎస్ జగన్ పాలన బాగుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో కూడా తమకు అండగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఎల్లవేళలా తమ ఆశీస్సులుంటాయని దీవించారు.
’గడప గడపకు మన ప్రభుత్వం’పై రేపు సదస్సు
‘గడప గడపకు మన ప్రభుత్వం’పై సోమవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల వ్యక్తిగత సహాయకులకు మరింత అవగాహన కల్పించేందుకు సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం అసెంబ్లీ కమిటీ హాల్ నంబర్–1లో జరుగుతుందని, సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది. మీ మీ వ్యక్తిగత సహాయకులను తప్పనిసరిగా ఈ సమావేశానికి పంపాలని ఆ ప్రకటనలో కోరింది. మరింత సమాచారం కోసం 9963818111, 9666366499 మొబైల్ నంబర్లను సంప్రదించాలని పార్టీ కేంద్ర కార్యాలయం సూచించింది.