అవ్వ అనుమంతమ్మతో ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, నాయకులు
ఎమ్మెల్యే : అవ్వా బాగున్నావా..
అవ్వ : బాగుండా నాయనా..
ఎమ్మెల్యే : పింఛన్ వస్తోందా..
అవ్వ : వస్తుందప్పా..
ఎమ్మెల్యే : ఎవరు ఇస్తున్నారవ్వా..
అవ్వ: ఇంకెవరు.. నా పెద్దకొడుకు జగన్ ఇస్తున్నాడు.
ఎమ్మెల్యే : జగన్ అంటే ఎందకు అంత ప్రేమ అవ్వా..
అవ్వ : ఎందుకంటే నాయనా.. పుట్టిన కొడుకులే చూడటం లేదు. నెలనెలా ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నారు.. నా పెద్ద కొడుకుగా జగన్‌ను తలుచుకుంటూ ఉంటా..
కర్నూలు: అవ్వ పలుకులు వినగానే జనం మోముల్లో చిరునవ్వు పుట్టుకొచ్చింది. అవ్వ మాటలకు అందరూ ఒక్కసారిగా నవ్వారు. కూతురు వద్ద కాలం వెల్లదీస్తున్న అవ్వ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మీద కురిపించిన ప్రేమ నిజంగా అభినందనీయం. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా సోమవారం చెట్నెహళ్లి గ్రామంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, మండల కన్వీనర్ భీమిరెడ్డి, మండల ఇన్‌చార్జ్ విశ్వనాథ్‌రెడ్డితో కలిసి పర్యటించారు. గ్రామంలో 419 ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ పథకాలు గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ పథకాలతో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు.
అవ్వాతాతలు, అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు సైతం జగనన్నను ఎంతగానో ప్రేమిస్తున్నారని పేర్కొన్నారు. అమ్మఒడి, వైఎస్సార్ పింఛన్ ఆసరా, రైతు భరోసా తదితర పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారని గుర్తు చేశారు. నియోజకవర్గం ప్రగతి కోసం సర్వదా కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామస్తుల కోరిక మేరకు ఎస్సీ కాలనీలో డ్రెయినేజీ సమస్యకు పరిష్కారం చూపుతానని చెప్పారు. అలాగే గ్రామంలోని భీరలింగేశ్వరస్వామి ఆలయ వెనుక భాగంలో మట్టి రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు అంజినయ్య, ఎంఈవో మొయినుద్దీన్, ఏపీఎం జయశ్రీ, ఏపీవో తిమ్మారెడ్డి, ఎస్‌ఐ చంద్ర, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి భార్గవి, సర్వేయర్ హరికృష్ణ, ఏఈవో నరసింహుడు, నాయకులు వెంకటేశ్ , వీరనాగుడు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment