గండికోట ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: గాలేరు నగరి, హంద్రీనీవాలను అనుసంధానం చేయడం ద్వారా రెండు పథకాల కింద ఆయకట్టుకు సమర్థంగా నీళ్లందించే పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కృష్ణా నదికి వరద వచ్చే 40 రోజుల్లోనే వరద జలాలను ఒడిసి పట్టి ప్రాజెక్టులను నింపడం ద్వారా దుర్భిక్ష రాయలసీమను సుభిక్షం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధృడ సంకల్పంతో పనులు చేపట్టిన విషయం తెలిసిందే.
► గాలేరు నగరి సుజల స్రవంతి నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలోకి నీటిని ఎత్తిపోసే పనులను రూ.5,036 కోట్లతో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
► గండికోట సీబీఆర్(చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) ఎత్తిపోతల, గండికోట పైడిపాలెం ఎత్తిపోతల అభివృద్ధి పనులను రూ.3,556.76 కోట్లతో చేపట్టేందుకు కూడా పరిపాలన అనుమతి ఇచ్చింది.
► గాలేరు నగరి సుజల స్రవంతి నుంచి గండికోట రిజర్వాయర్‌కు మరో పది వేల క్యూసెక్కులు తరలించేందుకు వీలుగా వరద కాలువలో 52.184 కి.మీ నుంచి 58.835 కి.మీ వరకు అదనపు టన్నెల్ తవ్వకం పనులను రూ.604.80 కోట్లతో చేపట్టడానికి అంగీకరించింది.
► సీబీఆర్ నుంచి ఎర్రబెల్లి చెరువులోకి నీటిని ఎత్తిపోసి గిడ్డంగివారిపల్లి వద్ద కొత్తగా 1.20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే రిజర్వాయర్‌లోకి తరలించి పులివెందుల, వేముల మండలాల్లో యూసీఐఎల్(యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) ప్రభావిత ఏడు గ్రామాల్లో సూక్ష్మనీటిపారుదల పద్ధతిలో పది వేల ఎకరాలకు నీళ్లందించే పనులను రూ.1,113 కోట్లతో చేపట్టేందుకు అనుమతి ఇచ్చింది. ఈ పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
► వీటికి సంబంధించిన టెండర్ షెడ్యూళ్లను జ్యుడిషియల్ ప్రివ్యూ(న్యాయ పరిశీలన)కు పంపేందుకు జలవనరుల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
► వైఎస్సార్ జిల్లాలో ఆదినిమ్మాయపల్లె ఆనకట్టకు దిగువన పుష్పగిరి దేవాలయం వద్ద ఒక టీఎంసీ సామర్థ్యంతో పెన్నా నదిపై రిజర్వాయర్ నిర్మాణానికి డీపీఆర్ రూపకల్పనకు కూడా రూ.35.50 లక్షలతో పరిపాలన అనుమతి మంజూరైంది.
Comments
Please login to add a commentAdd a comment