వైఎస్సార్‌సీపీ శ్రేణులే టార్గెట్
ఊరొదిలి వెళ్లిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై గంజాయి కేసు
పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెట్టిస్తున్న అధికారపార్టీ నేతలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ వారి దౌర్జన్యం శృతిమించింది. కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు దిగి భయభ్రాంతులకు గురిచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెడుతున్నారు. గంజాయి కేసుల్లో ఇరికిస్తున్నారు. అధికారపక్షం కావడంతో పోలీసులు వారు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
తాజాగా రేపల్లెకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు రాజ్‌పాల్‌పై పోలీసులు గాంజా కేసు నమోదు చేశారు. ఇటీవల గంజాయితో పట్టుబడిన ముఠాలో రాజ్‌పాల్ లేకున్నా పోలీసులు కేసులో అతడి పేరు చేర్చారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. వాస్తవానికి రాజ్‌పాల్ ఓట్ల› లెక్కింపు అనంతరం టీడీపీ నేతల బెదిరింపులతో ఊరువదలి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు రేపల్లెకు రాలేదు. అయినా పోలీసులు అతడిపై గాంజా కేసు నమోదు చేశారు.
తప్పుడు కేసులు మానుకోవాలి
అధికారం శాశ్వతం కాదని, టీడీపీ నేతలు ఇప్పటికైనా తెలుసుకుని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు శృతిమించాయన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా మారకపోతే తాము రోడ్డెక్కి ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.
రేపల్లెకు చెందిన తమ పార్టీ కార్యకర్త రాజ్‌పాల్ యాదవ్‌పై పోలీసులతో అధికారపార్టీ నేతలు గంజాయి కేసు పెట్టించడం దారుణమన్నారు. పోలింగ్ నాడు టీడీపీ నాయకుడితో రాజ్‌పాల్ గొడవ పడ్డారని, ఆ కక్షతోనే ఇప్పుడు అతడిపై గంజాయి కేసు పెట్టించారని చెప్పారు. ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ వారి దాడులు పెరగడంతో రాజ్‌పాల్, మరికొందరు ఊరు వదలి వెళ్లారని తెలిపారు. తరువాత ఇప్పటికీ రాజ్‌పాల్ రేపల్లె రాలేదని చెప్పారు.
రాజ్‌పాల్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకోబోతే పరారయ్యాడని పోలీసులు కట్టుకథ అల్లి అతడిపై కేసు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ వారు దాడులు చేస్తారని ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్న రాజ్‌పాల్‌పై తప్పుడు కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీలు అధికారంలోకి రావడం, పోవడం సర్వసాధారణమన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment