
విమానాశ్రయం (గన్నవరం): కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్‌పోర్టులో భారీ విమానాల రాకపోకల కోసం కొత్తగా విస్తరించిన రన్‌వే గురువారం నుంచి వినియోగంలోకి రానుంది. ఇందుకోసం ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. 2017 జనవరి 12న ట్రాన్సిట్ టెర్మినల్‌ను ప్రారంభించడంతో పాటు తొలిదశ రన్‌వే విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. సుమారు రూ.100 కోట్లతో ప్రస్తుతమున్న 2,286 మీటర్ల రన్‌వేను.. 45 మీటర్ల వెడల్పు, 1,074 మీ. పొడవున విస్తరించారు. దీంతో రన్‌వే పొడవు 3,360 మీటర్లకు చేరుకుంది. తద్వారా రాష్ట్రంలోనే అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్ట్‌గా గన్నవరం ఎయిర్‌పోర్టు గుర్తింపు సాధించింది. తర్వాతి స్థానంలో 3,048 మీ. పొడవుతో విశాఖ ఎయిర్‌పోర్ట్ ఉంది.
గన్నవరంలోని కొత్త రన్ వేపై బోయింగ్ బీ747, బీ777, బీ787, ఎయిర్‌బస్ ఎ330, ఎ340, ఎ350 వంటి భారీ విమానాలు రాకపోకలు సాగించవచ్చు. రన్‌వే విస్తరణతో పాటు ఐసొలేషన్ బే, ట్యాక్సీ వే, లింక్ ట్యాక్సీ ట్రాక్, రెండు వైపుల రన్‌వే ఎండ్ సేఫ్టీ ఏరియా, లైటింగ్, బౌండరీ వాల్ పనులను ఎయిర్‌పోర్ట్ అధికారులు పూర్తి చేశారు. వాస్తవానికి ఎయిర్‌పోర్ట్ రన్‌వే విస్తరణ పనులు రెండేళ్ల క్రితమే పూర్తయ్యాయి. కానీ పలు సెక్యూరిటీ కారణాల వల్ల డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అనుమతులు రావడంలో జాప్యం జరిగింది. ఈ నెల 15 నుంచి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు డీజీసీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment