సాక్షి, అమరావతి: వృద్ధుల జీవిత కాలాన్ని పొడిగించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మంచానికి పరిమితమైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని ఒక ప్రభుత్వాస్పత్రిలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా జెరియాట్రిక్ వార్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ వార్డుల్లో క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ తదితర జబ్బులతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వృద్ధులకు వైద్య సేవలందిస్తారు. ప్రతి జెరియాట్రిక్ వార్డులో 10 పడకలుంటాయి. ఒక జనరల్ ఫిజీషియన్, ఇద్దరు నర్సులు, ఫిజియోథెరపిస్ట్ సహా ఇతర సిబ్బంది అందుబాటులో ఉంటారు.
ఒక్కో వార్డు ఏర్పాటుకు ప్రభుత్వం రూ.20 లక్షలు ఖర్చు చేస్తోంది. జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లో ఈ జెరియాట్రిక్ వార్డులను ఏర్పాటు చేస్తారు. అనంతపురం, గుంటూరు, వైఎస్సార్, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న జిల్లా, ఏరియా ఆస్పత్రుల్లోని ఒక్కో వార్డును జెరియాట్రిక్ వార్డులుగా మార్చారు. గతేడాదే ఆయా జిల్లాల్లో ఈ వార్డులు అందుబాటులోకొచ్చినా.. కరోనా కారణంగా సేవలు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వైద్య సేవలు ప్రారంభిస్తున్నారు. కర్నూలు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, శ్రీకాకుళం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో జిల్లా, ఏరియా ఆస్పత్రుల ప్రాంగణంలో కొత్తగా వార్డులు నిర్మిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణాల్లో వార్డుల నిర్మాణం పూర్తయింది. దీంతో త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
మలిసంధ్యలో చేయూత
Published Thu, Feb 17 2022 4:07 AM | Last Updated on Thu, Feb 17 2022 4:07 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment