శ్రీవారి ఆలయ రాజగోపురాల సముదాయం
సాక్షి, ద్వారకా తిరుమల: శ్రీవారి అంబరుఖానా (ప్రసాదాల తయారీ కేంద్రం)లో ఇటీవల జరిగిన నెయ్యి కుంభకోణం ఘటనకు సంబంధించి నలుగురు ఉద్యోగులపై ఆలయ ఈఓ డి.భ్రమరాంబ సోమవారం చర్యలు చేపట్టారు. అలాగే ఆ ఘటనపై విచారణ జరిపే సమయంలో స్టాకులో పలు అవకతవకలను గుర్తించిన ఈఓ మరో నలుగురు ఉద్యోగులకు ఇప్పుడు మెమోలను జారీచేశారు. వివరాల్లోకి వెళితే.. స్వామి లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి 11 వందల కేజీలు మాయమైనట్లు ఈ ఏడాది జూలైలో దేవస్థానం అధికారులు గుర్తించారు. ఆ సమయంలో అంబరుఖానా గుమస్తాగా పనిచేస్తున్న మద్దాల శ్రీనును దానికి బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేశారు. అలాగే అతడి నుంచి రూ.5.30 లక్షలను రికవరీ చేశారు. రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్ దీనిపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశిస్తూ, అప్పటి రీజినల్ జాయింట్ కమిషనర్, ప్రస్తుత శ్రీవారి దేవస్థానం ఈఓ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన భ్రమరాంబ నివేదికను కమిషనర్‌కు అందజేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న మద్దాల శ్రీనుకు రెండు ఇంక్రిమెంట్లు కట్‌చేసి, విధుల్లోకి తీసుకుంటూ ఈఓ భ్రమరాంబ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇదే ఘటనకు సంబంధించి ఒక ఏఈఓను, ఒక సూపరింటెండెంట్‌ను, అలాగే మరో గుమస్తాను బాధ్యులను చేస్తూ, వారికి ఒక్కో ఇంక్రిమెంట్‌ను కట్‌చేస్తూ ఆదేశాలిచ్చారు.
అవకతవకలపై మరో నలుగురికి..
నెయ్యి కుంభకోణం ఘటనపై విచారణ జరిపిన సమయంలో ఈఓ భ్రమరాంబ అంబరుఖానాలోని స్టాకులో పలు అవకతవకలను గుర్తించినట్లు తెలిసింది. దీనికి ఒక ఏఈఓను, ఒక సూపరింటెండెంట్‌ను, ఇద్దరు గుమస్తాలను బాధ్యులను చేస్తూ, ఏడు రోజుల్లో వివరణ కోరుతూ వారికి మెమోలను జారీచేశారు. అలాగే చైతన్యజ్యోతి వెల్ఫేర్ సొసైటీకి నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్ ఇచ్చిన ఏఈఓకు ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ షాపు లీజు విషయంలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వైకుంఠరావును నియమించారు. వీటికి సంబంధించి ఆలయ ఈఓ భ్రమరాంబను వివరణ కోరేందుకు యత్నించగా ఆమె అందుబాటులోకి రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment