కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..1880 నుంచి అమ్మవారికి పూజలు  | Glorious Mavullamma Kshetram Worship of the Goddess since 1880 | Sakshi
Sakshi News home page

కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి..1880 నుంచి అమ్మవారికి పూజలు 

Published Mon, Jan 10 2022 8:41 AM | Last Updated on Mon, Jan 10 2022 9:03 AM

Glorious Mavullamma Kshetram Worship of the Goddess since 1880 - Sakshi

భీమవరం: మావుళ్లమ్మ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు.. గ్రామ దేవతగా నిత్య పూజలు అందుకుంటున్న అమ్మవారు నిలువెత్తు స్వర్ణమయంతో.. చూసిన కనులదే భాగ్యం అన్నట్లుగా దర్శనమిస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భక్తులు పూజిస్తారు. అమ్మవారి దివ్య స్వరూపాన్ని చూసేందుకు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఎంతో మహిమ గల అమ్మవారిని దర్శించుకుంటే ఉద్యోగ, వృత్తి, వ్యాపారం రాణిస్తామనేది నమ్మకం. భీమవరం ప్రాంత ప్రజలకు తమ పనిలో రాణించాలంటే అమ్మవారి ఆ«శీస్సులు ఉండాలని ఎంతగానే విశ్వసిస్తారు. అనేక మంది తమ వ్యాపారాలకు అమ్మవారి పేరు పెట్టుకుని విజయవంతంగా సాగిపోతున్నారు. చిన్నారులకు అక్షరాభ్యాసం నుంచి పెళ్లి శుభలేఖ అమ్మవారి పాదాల వద్ద పెట్టే వరకు అన్నింటికీ అమ్మవారి దయ ఉండాల్సిందే. దేశంలో మన తెలుగువారున్న ప్రాంతానికి ఎక్కడికి వెళ్లినా భీమవరం అంటే మావుళ్లమ్మ అమ్మవారు వెలిసిన పట్ణణమని గుర్తుచేసుకుంటారు.  

ఏటా 33 రోజుల పాటు వార్షికోత్సవాలు 
మావుళ్లమ్మకు ఏడాదంతా జాతర్లు, ఉత్సవాలు, పూజలు జరుగుతూనే ఉంటాయి. 10 రోజుల పాటు దసరా ఉత్సవాలు, ఉగాది, ఆషాడ మాస పూజలు, సారెలు, వార్షిక మహోత్సవాలు ఇలా ఏడాదంతా సందడే సందడి.. సంక్రాంతి సమయంలో వార్షికోత్సవాల్ని సుమారు 33 రోజలు పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అత్యంత వైభవంగా జ్యేష్ట మాసం జాతర నిర్వహిస్తారు. ఆషాడ మాసంలో పట్ణణంలోని ప్రతి చోట అమ్మవారి జాతరను ప్రజలు నిర్వహించుకుంటారు. ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారి దేవస్థానంలో చండీహోమం జరుపుతారు. ఏటా పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీమావుళ్లమ్మ అమ్మవారి మా«లధారణ దీక్ష తీసుకుంటారు. దసరా, వార్షికోత్సవ ఉత్సవాల్లో అమ్మవారు వివిధ దేవతామూర్తుల అలంకరణలో దర్శనమిస్తారు. 

50 కిలోల ఆభరణాలతో అలంకరణ 
మావుళ్లమ్మ నిలువెత్తు స్వర్ణమయానికి దాతలు, భక్తులు సంకల్పించారు. సుమారు 8 ఏళ్ల నుంచి అమ్మవారిని స్వర్ణమయం చేయడానికి బంగారం సేకరిస్తున్నారు. 100 కిలోల బంగారం సేకరణ లక్ష్యం కాగా ఇంతవరకు సుమారు 63 కిలోలు సేకరించారు. అందులో సుమారు 50 కిలోల బంగారంతో అమ్మవారికి బంగారు ఆభరణాలు తయారు చేయించి అలంకరించారు. మరో 13 కిలోల బంగారంతో అభరణాల తయారీకి సిద్ధంగా ఉన్నారు. భక్తులు, దాతలు తమ స్తోమతను బట్టి 2 గ్రాముల నుంచి 50 గ్రాముల వరకు బంగారాన్ని విరాళంగా అందిస్తున్నారు. ఇక అమ్మవారికి భక్తులు చీరలు, జాకెట్‌ ముక్కలు మొక్కుగా చెల్లించుకుంటారు. భక్తులు సమర్పించిన చీరలు, జాకెట్‌ ముక్కలను దేవస్థానం వేలం పాట నిర్వహిస్తుంది. మహిళలు వీటిని వేలంలో దక్కించుకుంటారు. ఈ వేలం ద్వారా దేవస్థానానికి లక్షల రూపాయల ఆదాయం లభిస్తుంది. 

దూరప్రాంత భక్తుల కోసం నిత్యాన్నదానం 
అమ్మవారి దర్శనానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం సుమారు 13 ఏళ్ల క్రితం అమ్మవారి సన్నిధిలో శాశ్వత నిత్యాన్నదానం ప్రారంభించారు. సాధారణ రోజుల్లో సుమారు 200 మందికి.. ఉత్సవాలు, ప్రత్యేక పూజలు, పండుగల రోజుల్లో సుమారు 300 మంది వరకు అన్నదానం చేస్తారు. దాతలు అన్నదానానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తుంటారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు లడ్డు, పులిహోర ప్రసాదంగా విక్రయిస్తారు. మావుళ్లమ్మ అమ్మవారికి సుమారు 9 ఎకరాల సాగు భూమి ఉంది. ఆలయం ఎదురుగా రూ.కోట్ల విలువ చేసే స్థలంతో పాటు ఉండి రోడ్డులో కమర్షియల్‌ కాంప్లెక్సు భవనం ఉంది. అమ్మవారి దేవస్థానం ట్రస్టీ బోర్డు 9 మంది ధర్మకర్తలతో నడుస్తోంది. ఒకరు చైర్మన్‌గా, 8 మంది ధర్మకర్తలుగా సుమారు రెండేళ్లు పాటు అమ్మవారి సేవలో ఉంటారు.  

1880లో తొలిసారి పూజలు 
మావుళ్లమ్మ వెలిసిన ప్రాంతంపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మవారు 1200 ఏళ్ల క్రితం ఇక్కడ వెలిసినట్లు చెబుతారు. 1880 సంవత్సరంలో ఇక్కడ పూరిపాక వేసి అమ్మవారికి పూజలు ప్రారంభించారు. పట్టణంలో ఉన్న మోటుపల్లి వీధిలో అమ్మవారి గరగలు భద్రపరిచేందుకు నిర్మించిన భవనం ప్రాంతంలో వేప, రావి చెట్టు కలిసి ఉన్న చోట మావుళ్లమ్మ వెలిశారని చరిత్ర చెబుతుంది. మామిడి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో వెలిసిన తల్లి కనుక మామిళ్ళు అమ్మగా.. అనంతరం మావుళ్లమ్మగా పేరు వచ్చిందని చెబుతారు. 1880 సంవత్సరం వైశాఖ మాసం రోజుల్లో భీమవరానికి చెందిన మారెళ్ళ మాచిరాజు, గ్రంధి అప్పన్నలకు అమ్మవారు కలలో కనిపించి తాను వెలిసిన ప్రాంతంలో ఆలయం నిర్మించాలని ఆదేశించారంటారు. అమ్మవారి విగ్రహానికి ఎండ తగలకుండా పూరిపాక వేసి పూజలు చేసేవారు. అనంతరం మాచిరాజు, అప్పన్నలు ప్రస్తుత ఆదివారం బజార్‌ ప్రాతంలో అమ్మవారికి ఆలయం నిర్మించారు. 1910 ప్రాంతంలో  కాళ్ళ గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యలు అమ్మవారి విగ్రహాన్ని మలిచారు. అమ్మవారు ప్రళయ భీకర స్వరూపిణిగా కనిపించేవారు. దాంతో గ్రంధి నర్సన్న కుమారుడు అప్పారావు విగ్రహాన్ని శాంతి స్వరూపిణిగా తీర్చిదిద్దారు. తొలి నుంచి మెంటే వెంకటస్వామి పూర్వీకులు, అల్లూరి భీమరాజు వంశస్తులు అమ్మవారి పుట్టింటి వారిగా, గ్రంధి అప్పన్న మొదలైన వారి పూర్వీకులు అత్తింటివారిగా జ్యేష్ట మాస జాతర ఉత్సవాలలో పాల్గొంటారు.

అమ్మవారి దర్శనానికి ప్రముఖుల క్యూ 
మావుళ్లమ్మ అమ్మవారి దర్శనం కోసం పలువురు ప్రముఖులు తరలివస్తుంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, సినిమా హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, క్రీడాకారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు తరచూ అమ్మవారిని దర్శించుకుంటారు. ఉత్సవాల సమయంలో పలువురు ప్రముఖులకు సన్మానాలు చేస్తుంటారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement