![Godavari Flood is gradually increasing due to heavy rains - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/16/godacv.jpg.webp?itok=doMWONOQ)
పోలవరం వద్ద వరద నీరు
సాక్షి, అమరావతి: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉధృతి క్రమేణా పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్దకు 1.20 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటంతో నీటిమట్టం 28.75 అడుగులకు చేరుకుంది. వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 స్పిల్ వే గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,10,941 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. గోదావరి డెల్టా కాలువలకు 7,200 క్యూసెక్కులు విడుదల చేసి.. మిగులుగా ఉన్న 1,03,741 క్యూసెక్కులను ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. తెలంగాణలో బ్యారేజీలు నిండిపోవడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగుల నుంచి కూడా భారీగా వరద గోదావరిలోకి చేరుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో ఆగని తెలంగాణ విద్యుదుత్పత్తి
పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 21,082 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ 7,063 క్యూసెక్కులను వదిలేస్తుండటంతో.. ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడం లేదు. ప్రస్తుతం 806.89 అడుగుల్లో 32.53 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వర్షాల వల్ల వచ్చిన వరదకు మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తేయడంతో పులిచింతల్లోకి 9,262 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 10,521 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి చేరుతుండగా మిగులుగా ఉన్న 8,094 క్యూసెక్కులను 20 గేట్లు అర్ధ అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment