మార్కాపురం పలకల ఫ్యాక్టరీలో పని చేసే కార్మికులు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మార్కాపురం పలకల పరిశ్రమ మళ్లీ జీవం పోసుకుంటోంది. కరోనాతో ఎగుమతి ఆర్డర్లు లేక మూతపడిన ఫ్యాక్టరీలు కరోనా తగ్గడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. ఇప్పుడిప్పుడే వివిధ దేశాలు ఆంక్షలు ఎత్తివేస్తుండటంతో ప్రస్తుతం దాదాపు 15 ఫ్యాక్టరీల్లో పనులు జరుగుతున్నాయి. సుమారు 3 వేల మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు.
మార్కాపురం: కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రకాశం జిల్లా మార్కాపురం పలకల పరిశ్రమకు మంచి రోజులు రానున్నాయని పారిశ్రామికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా ఆంక్షలతో ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. నాలుగైదు నెలల నుంచి ఆంక్షలు ఎత్తి వేయటంతో యజమానులు ఫ్యాక్టరీలను తెరవటంతో మళ్లీ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కళకళలాడుతోంది. ఫ్యాక్టరీలు మూతపడటంతో 6 వేల మందికి పైగా కార్మికులు పనులు లేక భవన నిర్మాణ కార్మికులుగా, ఇతరత్రా కూలీలుగా మారారు. మరికొందరు వలసలు పోయారు.
2010లో ఈ ప్రాంతంలో సుమారు 100 ఫ్యాక్టరీలు ఉండేవి. టీడీపీ హయాంలో అనుసరించిన పారిశ్రామిక విధానాలు, రాయితీల ప్రోత్సాహం లేకపోవటం, విద్యుత్ చార్జీలు పెంచటం, కూలీల చార్జీలు పెరగటం, ఎగుమతుల ఆర్డర్‌లు లేకపోవటంతో సంక్షోభం ఏర్పడింది. దీంతో 2015 నాటికి ఫ్యాక్టరీల సంఖ్య 30కి చేరింది. మళ్లీ కరోనా రావటంతో అమెరికా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాలకు విమానాలు లేక పూర్తిగా ఎగుమతులు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే వివిధ దేశాలు ఆంక్షలు ఎత్తివేయటంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో దాదాపు 15 ఫ్యాక్టరీలలో పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమెరికాకు మాత్రమే షిప్‌లలో కొంత మేర ఎగుమతులు పంపుతున్నారు.
దేశీయంగా కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ, చెన్నై ప్రాంతాలకు లారీల ద్వారా డిజైన్ స్లేట్స్ పంపుతున్నారు. సుమారు 3 వేల మంది కూలీలు గని కార్మికులుగా, ఫ్యాక్టరీ వర్కర్లుగా, అనుబంధంగా ఉండే బలపాల పరిశ్రమలో కూడా పని చేస్తున్నారు. పలకల గనులు మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, దొనకొండ మండలాల్లోని తుమ్మలచెరువు, రాయవరం, కలుజువ్వలపాడు, గానుగపెంట, పోతలపాడు, గజ్జలకొండ, మల్లంపేట, పెద్దయాచవరం, నాయుడుపల్లె తదితర గ్రామాల్లో సుమారు 15 కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. కార్మికులు వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. అయితే అంతర్జాతీయంగా వచ్చిన మార్పులు, గత 8 ఏళ్లుగా ప్రభుత్వాలు పలకల పరిశ్రమల అభివృద్ధికి సహకరించకపోవటంతో ఒక్కొక్కటిగా మూతపడుతూ ప్రస్తుతం 30కి చేరాయి.
జీఎస్టీ అదనపు భారం కావటం, విద్యుత్ చార్జీలు పెరగటం, ఎగుమతుల ఆర్డర్లు తగ్గటంతో పలకల పరిశ్రమ ప్రాభవం తగ్గింది. ఇదే సమయంలో చైనాలో కూడా మార్కాపురం పలకల పరిశ్రమలో లభించే రాయి దొరకటం, వారు తక్కువ రేటుకు ఇస్తుండటంతో అమెరికా, శ్రీలంక, సింగపూర్ లాంటి దేశాల వారు చైనా నుంచి తెప్పించుకుంటున్నారు. సుమారు 15 ఏళ్ల కిందట పలకల వాడకం ఎక్కువగా ఉండేది. కంప్యూటర్లు రావటం, విద్యా వ్యవస్థలో మార్పుల వలన పలకల వాడకం తగ్గిపోయింది. దీంతో మార్కాపురం పలకల వ్యాపారులు పలకల రాయిని డిజైన్ స్లేట్‌గా మార్పు చేశారు. మొజాయిక్, పింక్, ఆటమ్, మల్టీకలర్ తదితర రంగుల్లో మార్కాపురం పలకల రాయి లభిస్తుంది. దీనిని వివిధ సైజుల్లో కట్ చేసి గృహాలకు అందంగా అలంకరించేందుకు చెన్నై, ముంబయ్, కోల్‌కత్తా, ఢిల్లీ, బెంగళూరు, పంజాబ్, కేరళ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇతర దేశాలైన శ్రీలంక, సింగపూర్, అమెరికా, జపాన్ దేశాలకు పంపుతున్నారు.
రాయితీలు ఇవ్వాలి
మార్కాపురం పలకల పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం సహకరించాలి. చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమకు జీఎస్టీ మినహాయింపు ఇచ్చినట్లుగా మార్కాపురం పలకలకు మినహాయింపు ఇవ్వాలి. పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలి. విద్యుత్ చార్జీలు తగ్గించాలి. ఎగుమతులను ప్రోత్సహించాలి.
– బట్టగిరి తిరుపతిరెడ్డి, పలకల ఫ్యాక్టరీ యజమాని
రాయల్టీ తగ్గించాలి
ప్రభుత్వం పలకల గనులపై ఉన్న రాయల్టీని తగ్గించాలి. చిన్న క్వారీలకు నిబంధనల్లో మినహాయింపు ఇవ్వాలి. ఎక్స్‌పోర్టులో కూడా ఆంక్షలు సడలించాలి. పలకల పరిశ్రమ బాగుంటే ఈప్రాంతంలో వలసలు ఉండవు, కూలీలందరికీ పని ఉంటుంది.
– వెన్నా పోలిరెడ్డి, డిజైన్ స్లేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment