Good News! CM YS Jagan Green Signal To Group 1, 2 Notification - Sakshi
Sakshi News home page

AP: ఉద్యోగాల వెల్లువ

Published Thu, May 25 2023 3:08 PM | Last Updated on Fri, May 26 2023 7:39 AM

Good News CM Jagan Green Signal To Group 1 Group 2 exam Notification - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరోసారి ఉద్యోగాల జాతరకు రాష్ట్ర ప్రభుత్వం నగారా మోగించింది. కీలకమైన గ్రూప్‌–1, గ్రూప్‌–2కు సంబంధించి మొత్తం 1,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో గ్రూప్‌–1 పోస్టులు 100కాగా గ్రూప్‌–2 పోస్టులు 900 ఉన్నాయి.

ఈ మొత్తం పోస్టుల భర్తీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టులకు అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం ఉదయం గ్రూప్‌–1, 2 పోస్టుల భర్తీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని అధికారులు సీఎంకు వివరించారు. త్వరితగతిన ఈ పోస్టులను భర్తీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నోటి­ఫికేషన్ల జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉందని అధికారులు ఆయనకు తెలిపారు. వీలై నంత త్వరగా నోటిఫికేషన్లు జారీ చేయాలని సీఎం సూచించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపైనా దృష్టి సారించాలని ఆదేశించారు. 
 
 బాబు పాలనంతా బూడిదే.. 
గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఐదేళ్లపాటు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదు. సరిగ్గా సాధారణ ఎన్నికలకు ముందు 2018 డిసెంబర్‌లో మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటి భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించే సమయం లేకుండా కేవలం ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ఈ వ్యవహారమని అప్పట్లోనే విద్యావేత్తలు, అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేలా తొలి రోజు నుంచే అడుగులు ముందుకు వేశారు. ఏపీపీఎస్సీ ద్వారా కూడా వేలాది పోస్టులను ఈ నాలుగేళ్లలో భర్తీ చేయించారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ న్యాయవివాదాల్లో చిక్కుకొని.. నిరుద్యోగులకు ఉద్యోగాలు అందని ద్రాక్షలా మారగా వాటన్నింటినీ పరిష్కరింపజేశారు. అంతేకాకుండా వాటిని భర్తీ చేయించారు.

ఏపీపీఎస్సీ ద్వారానే ఈ నాలుగేళ్లలో 5 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. కీలకమైన గ్రూప్‌–1తో సహా ఇతర పోస్టులూ వీటిలో ఉన్నాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో 4.5 లక్షల ఉద్యోగులు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య 6 లక్షలకు పెరిగిందంటే ఏ మేరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరిగిందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా ఈ నాలుగేళ్లలో రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు, ఇతర సంస్థల్లో 15 నుంచి 20 లక్షల ఉద్యోగాలు యువతకు లభించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.

ముఖ్యంగా సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ ) రంగంలో ఉద్యోగాలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో 1.10 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉండగా ఒక్కోదానిలో కనీసంగా 10 మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు లభించాయి.  
 
వలంటీర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ పోస్టుల్లోనూ..  
గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని అందించడానికి ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున ప్రభుత్వం గ్రామ, వార్డు వలంటీర్లను నియమించింది. మొత్తం 2.65 లక్షల మందికి గౌరవ వేతనం అందిస్తూ ఉపాధి కల్పించింది. అలాగే గతంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. ప్రైవేటు సంస్థలకు గుత్తాధిపత్యం ఇవ్వడం వల్ల వారికి ఉద్యోగ భద్రత, సరైన వేతనాలు అందేవి కావు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ కాంట్రాక్టు పోస్టులతో పాటు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్నే ఏర్పాటు చేయించారు. బ్రోకర్లు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వారికి పూర్తి వేతనాలు చెల్లించడంతోపాటు ఈఎస్‌ఐ వంటి సదుపాయాలూ కల్పించారు. వీరికి అరకొర వేతనాలు ఉండగా జీతాలను భారీగా పెంచారు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఏకంగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ను అమల్లోకి తెచ్చారు. ఫలితంగా ఆ ఉద్యోగులకు ఎంతో న్యాయం జరిగింది. 
 
చదువులు పూర్తవగానే ఉద్యోగాలు సాధించేలా శిక్షణ 
రాష్ట్రంలో విద్యార్థులను పూర్తి నైపుణ్యాలతో తీర్చిదిద్ది.. వారు చదువులు పూర్తిచేసి బయటకు రాగానే ఉద్యోగాలు సాధించేలా సీఎం వైఎస్‌ జగన్‌ చర్యలు తీసుకున్నారు. విద్యార్థులు చదువుతున్నప్పుడే వారికి అనేక ప్రతిష్టాత్మక సంస్థలతో శిక్షణ ఇప్పించి నిష్ణాతులుగా తీర్చిదిద్దుతున్నారు. డిగ్రీ కోర్సుల్లోనూ ఇంటర్న్‌షిను తప్పనిసరి చేయించారు.

డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా పది నెలలు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసేలా కోర్సులను అమలు చేయిస్తున్నారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో నైపుణ్యం పొందేలా అధికారులు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నారు. ఇందుకు రాష్ట్రంలోని అన్ని కళాశాలలను వివిధ పరిశ్రమలు, ఐటీ సంస్థలు, ప్రముఖ వాణిజ్య సంస్థలతో సహా కోర్సులతో సంబంధమున్న 27,119 సంస్థలతో అనుసంధానించారు. 
 
శిక్షణ సమయంలోనే ఉద్యోగాలు..  
విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ కోసం రాష్ట్రంలోని మైక్రో స్థాయి నుంచి మెగా పరిశ్రమల వరకు ఉన్నత విద్యా మండలి వాటిని విద్యా సంస్థలతో అనుసంధానం చేసింది. తయారీ, సేవా రంగాల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ సమయంలో మంచి పనితీరు కనబరిచేవారికి ఆ కంపెనీలే ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఫలితంగా 2018లో రాష్ట్రంలో ఏడాదికి 37 వేల మందికి మాత్రమే అవకాశాలు దక్కగా ఆ తర్వాత నుంచి ప్లేస్‌మెంట్స్‌లో భారీ వృద్ధి నమోదైంది.

2019–20లో 52 వేలకు, 2020–21లో 69 వేలకు, 2021–22లో 85 వేలకు ప్లేస్‌మెంట్లు పెరిగాయి. ఇక ఈ విద్యాసంవత్సరంలో 1.20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అలాగే ట్రిపుల్‌ ఐటీల్లో చదువుతున్న విద్యార్థులకు కూడా భారీగా డిమాండ్‌ పెరిగింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో వీరికి ఉద్యోగావకాశాలు దక్కుతున్నాయి. 2020–21 వరకు మొత్తం 13,208 మంది విద్యార్థులు నియామకాల కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 5,111 మందికి వివిధ సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభించాయి.

ట్రిపుల్‌ ఐటీ నూజివీడు క్యాంపస్‌లో 2,610 మందికి, ఆర్కే వ్యాలీలో 2,501 మందికి ఐటీ కంపెనీలు కొలువులు ఇచ్చాయి. టాటా కన్సల్టెన్సీ సర్విసెస్‌ (టీసీఎస్‌), ఇన్ఫోసిస్, విప్రో, అలక్రిటీ, ఏడీపీ, అచలా, పర్పుల్‌ టాక్, పర్పుల్‌ కామ్, సెలెక్ట్, నుక్కడ్‌ షాప్స్, సెవ్యా, సినాప్సిస్, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, రాంకీ, ఆర్వీ, హెటిరో, అటిబిర్, అమర్‌రాజా తదితర కంపెనీల్లో విద్యార్థులకు ఉద్యోగాలు దక్కాయి. అనలాగ్‌ డివైసెస్, ఫ్రెష్‌ డెస్క్, టెక్సాస్‌ ఇన్‌స్ట్రుమెంట్స్, సినాప్సిస్, జేవోటీటీఈఆర్, థాట్‌ వర్క్స్, ఏడీపీ, మేథ్‌ వర్క్స్, గోల్డెన్‌ హిల్స్‌ సంస్థలు అత్యధిక వేతనాలు అందించాయి.  

చదవండి: ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్‌ బులిటెన్‌ విడుదల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement