పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్న గోపాల్‌రెడ్డి
అనంతపురం క్రైం/చీరాల అర్బన్: వైఎస్సార్‌సీపీ నేతలను ఉద్దేశించి తీవ్రవాద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్ధా వెంకన్నపై కఠిన చర్యలు తీసుకోవాలని శాసనమండలి విప్ వెన్నపూస గోపాల్‌రెడ్డి పోలీసులను కోరారు. ఈ మేరకు గురువారం ఆయన అనంతపురం వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో బుద్ధాపై ఫిర్యాదు చేశారు. అనంతరం వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు జన్మదినం సందర్భంగా బుద్ధా వెంకన్న వైఎస్సార్‌సీపీ నేతలను చంపడానికి సిద్ధంగా ఉన్నామని.. ఇందుకు 100 మందితో బ్యాచ్ సిద్ధంగా ఉందంటూ బెదిరింపు వ్యాఖ్యలు చేశారన్నారు.
టీడీపీ నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి.. ప్రభుత్వాన్ని ఏదో రకంగా కూల్చాలనే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. బుద్ధా వెంకన్న వ్యాఖ్యల వెనుక చంద్రబాబు, లోకేష్ ఉన్నారని ఆరోపించారు. సమాజంలో అశాంతి, అలజడి సృష్టించేందుకు టీడీపీ ఈ సూసైడ్ బ్యాచ్‌ను సిద్ధం చేసిందని మండిపడ్డారు. వీరి నుంచి వైఎస్సార్‌సీపీ నేతలకు ప్రాణహాని ఉందన్నారు. వీరు మారణహోమం సృష్టించకముందే పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, బుద్ధా వెంకన్నపై వైఎస్సార్‌సీపీ యువజన విభాగం నాయకుడు యాతం మేరిబాబు గురువారం చీరాల వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment