సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదొడుకుల వల్లే ఆక్వా ఎగుమతులు తగ్గాయని, పది రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా సిండికేట్ వ్యాపారులకు కొమ్ముకాసి, రైతుల పొట్టకొట్టిన టీడీపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వంపై దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతల నేతృత్వంలో ప్రతిపక్షాలు చేస్తున్న విష ప్రచారాన్ని నమ్మవద్దని ఆక్వా రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చైనా, అమెరికా వంటి దేశాలకు ఎగుమతులు తగ్గడం వల్ల ఆక్వా ధరలు.. ప్రధానంగా రొయ్యల ధరలు తగ్గాయని తెలిపారు. ఈక్వెడార్ దేశంలో రొయ్యల ఉత్పత్తి గణనీయంగా పెరగడమూ కారణమని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తక్షణమే స్పందించి ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు మంత్రుల నేతృత్వంలో సాధికార కమిటీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
ఈ కమిటీ ఇప్పటికే ఎగుమతిదారులతో సమావేశమై మద్దతు ధర ఇవ్వాలని ఆదేశించిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఒడిదుడుకులు ఏర్పడినప్పుడు రొయ్యలు, చేపలను నిల్వ చేసుకోవడానికి రూ.546 కోట్లతో పది ప్రాసెసింగ్ యూనిట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఆక్వా రైతులకు ఎన్నో ప్రయోజనాలు
ఆక్వా రైతులకు సీఎం జగన్ ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారని తెలిపారు. పాదయాత్ర చేసిన సందర్భంగా యూనిట్ విద్యుత్ రూ.1.50కే హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక దానిని అమలు చేశారని చెప్పారు. దీనివల్ల 86 శాతం రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. మూడేళ్లలో విద్యుత్ సబ్సిడీ రూపంలోనే రూ.2,377 కోట్లు ఇచ్చారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో ఆక్వాకు రూ. 100 కోట్లు కూడా ఖర్చు చేయలేదని చెప్పారు.
కరోనా సంక్షోభంలోనూ సీఎం జగన్ రైతులకు అండగా నిలిచారని, ఎన్నడూ లేని రీతిలో ఆక్వా ఉత్పత్తులకు మంచి ధరలు ఇప్పించారని గుర్తు చేశారు. తక్కువ ధరకు నాణ్యమైన విత్తనం (సీడ్), ఫీడ్ (మేత) అందించేలా చట్టాలను తెచ్చారన్నారు. ఈ చర్యల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గిస్తున్నారని వివరించారు. ఆక్వా డెవలప్‌మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశారన్నారు.
అనుమతులను సులభతరం చేయడం వల్ల ఆక్వా సాగు ఐదు లక్షల ఎకరాలకు చేరుకుందన్నారు. ఆక్వా సాగులో దేశంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ఘనత సీఎంకు దక్కిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శిష్యులైన కొందరు వ్యాపారులు సిండికేట్ అయ్యి ఆక్వా రంగాన్ని దెబ్బతీసేలా దుష్ఫ్రచారం చేస్తున్నారని, వారి ఆటలు సాగనివ్వబోమని చెప్పారు.
పది రోజుల్లో ‘ఆక్వా సమస్య’ పరిష్కారం
Published Thu, Nov 17 2022 5:00 AM | Last Updated on Thu, Nov 17 2022 5:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment