రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఇక పాత పద్ధతిలోనే పనులకు టెండర్లు నిర్వహించాలని ఆదేశం
2014–19 మధ్య తరహాలోనే ఖజానా దోచేసేందుకు సిద్ధం
మంచి పనులను రద్దు చేయడమే లక్ష్యంగా సర్కారు అడుగులు
సీబీఎస్‌ఈ సిలబస్, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, సెబ్, పంటల
బీమా.. ఇలా ప్రజలకు మేలు చేసేవన్నీ రద్దు దిశగా చర్యలు
ఇది ‘రద్దు’ల ప్రభుత్వంగా పేరుగాంచిన వైనం
వ్యవస్థలను నిర్వీర్యం చేసి దండుకోవడమే ధ్యేయం
ప్రభుత్వ ఆస్తులను, ప్రజాధనాన్ని పరిరక్షించాల్సిన సర్కారే.. ఖజానా దోపిడీకి లైన్ క్లియర్ చేసింది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ పాత పద్ధతి (2003 జూలై 1న జారీ చేసిన జీవో 94) ప్రకారమే టెండర్లు పిలిచి, పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలని ఆగస్టు 28న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
దానిని అమలు చేస్తూ ఆదివారం జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు (జీవో ఎంఎస్ నంబర్ 40) జారీ చేశారు. దీంతో 2014–19 మధ్య కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ ఖజానాను దోచేసినట్లుగానే ఇప్పుడూ దోపిడీకి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు.
సీబీఎస్‌ఈ సిలబస్ రద్దు.. ఇంగ్లిష్ మీడియం రద్దు.. టోఫెల్ వ్యవస్థ రద్దు.. సెబ్ రద్దు.. వలంటీర్ వ్యవస్థ రద్దు.. ఇలా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వ్యవస్థలన్నీంటినీ చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేయడమే లక్ష్యంగా అడుగులేస్తోంది. కీలక వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఈ పరంపరలో పొరుగు రాష్ట్రాల ప్రశంసలు పొందిన రివర్స్ టెండరింగ్ విధానాన్నీ తాజాగా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ప్రతిపాదన దశలోనే బేరసారాలు
రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ముఖ్య నేతలు ఒక పని ప్రతిపాదన దశలోనే కాంట్రాక్టర్లతో బేరసారాలాడి కమీషన్లు ఖరారు చేసుకునేవారు. ఈ మేరకు అంచనాలు పెంచేయించడం.. ఎక్కువ కమీషన్ ఇచ్చేందుకు అంగీకరించిన కాంట్రాక్టర్‌కే ఆ పని దక్కేలా నిబంధనలను రూపొందించి టెండర్లు పిలవడం.. అదే కాంట్రాక్టర్‌కు అధిక ధరకు పనులు కట్టబెట్టడం.. ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్ అడ్వాన్సు ఇచ్చేసి.. వాటినే కమీషన్‌లుగా రాబట్టుకుని తమ జేబులో వేసుకోవడం రివాజుగా మార్చుకున్నారు. అప్పట్లో కేవలం టెండర్ల వ్యవస్థను నీరుగార్చి ప్రభుత్వ ఖజానా నుంచి సుమారు రూ.20 వేల కోట్లను దోచేశారు.
7,500కోట్లు ఆదా
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్(బీవోసీఈ) ఇచ్చిన నివేదిక ఆధారంగా టెండర్ల వ్యవస్థను ప్రక్షాళన చేశారు. జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ విధానం వంటి విప్లవాత్మక సంస్కరణలను అమల్లోకి తెస్తూ 2019, ఆగస్టు 16న ఉత్తర్వులు(జీవో 67) జారీ చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్సులను పూర్తిగా రద్దు చేశారు.
అత్యంత పారదర్శకంగా రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించడంతో కాంట్రాక్టర్లు భారీ ఎత్తున పోటీ పడ్డారు. దీంతో కాంట్రాక్టు విలువ కంటే తక్కువ ధరకే పనులు చేయడానికి ముందుకొచ్చారు. 2019 ఆగస్టు 16 నుంచి 2024 మే వరకు ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యాయి.
రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేయాలంటూ 2019, జూలై 26న నివేదిక ఇచ్చిన బీవోసీఈతోనే... ఆ విధానం రద్దు చేయాలంటూ గత నెల 21న చంద్రబాబు ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. ఆ నివేదికను అదే నెల 28న కేబినెట్‌లో ఆమోదించి.. పాత విధానంలో టెండర్ల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి0ది.
– సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment