
కంటి వెలుగు కింద అవ్వాతాలకు కంటి పరీక్షలు చేపడుతున్న కంటి వైద్యులు (ఫైల్)
సాక్షి, వైఎస్సార్, కడప : డాక్టర్ వైఎస్సార్ కంటి వెలుగు పథకం మళ్లీ వేగం అందుకుంది. కరోనా నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపి వేసిన ప్రక్రియను కొనసాగిస్తున్నారు. కళ్లద్దాలు పంపిణీ చేయడానికి, ఇతర సమస్యలకు చికిత్సను అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొదటి దశ గతేడాది అక్టోబర్ 10 వరకు ..రెండవ దశ నవంబర్ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అమలు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4,450 (1 నుంచి 10వ తరగతి) పాఠశాలల్లో 4,12,301 మంది విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. 32,800 విద్యార్దులకు కంటి వ్యాధులు ఉన్నట్లుగా గుర్తించారు. మళ్లీ కంటి వైద్య నిపుణులు బాధిత విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో 13,600 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించారు. వారందరికీ కళ్లద్దాలను పంపిణీ చేశారు. 2,600 మందికి ఇతర కంటి లోపాలను గుర్తించి చికిత్సను అందించారు.మిగతా విద్యార్ధులకు ఎలాంటి సమస్యలు లేవని నిర్ధారించారు.
మూడో దశకింద 60 ఏళ్లకు పైబడిన అవ్వాతాతలకు ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 20 వరకు కంటి పరీక్షలు నిర్వహించారు. 10 డివిజన్లలో 14,780 మందికి పరీక్షలు నిర్వహించారు. 9,028 మందికి కళ్లద్దాలు అవసరమని నిర్ధారించారు. 4,164 మందికి కంటి (ఐఓఎల్) ఆపరేషన్లు చేయాలని రెఫర్ చేశారు. ఇప్పటికే 302 మందికి ఆపరేషన్లు నిర్వహించారు. మిగిలిన 1,588 మందికి కంటి లోపాలు లేవని గుర్తించారు. కరోనా వైరస్ కారణంగా అప్పట్లో తాత్కాలికంగా పధకం ప్రక్రియను నిలిపి వేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అవ్వాతాతలకు కళ్లద్దాలు అందనున్నాయి. వైద్య నిపుణులు, వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే వెల్లి కళ్లద్దాలను అందజేస్తారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్‌లను చేస్తారు. (ఇంటివద్దకే కళ్లద్దాలు)
వచ్చే నెలలో కళ్లదాలు అందజేస్తాం
'అక్టోబర్ 1న ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా అవ్వాతాతలకు కళ్లద్దాలు పంపిణీ చేయడానికి చర్యలు చేపడుతున్నాం. ఇంటి వద్దకే వెల్లి కళ్లద్దాలు పంపిణీ చేస్తాం. అలాగే అవసరమైన వారికి ఆపరేషన్లు చేయడానికి చర్యలు చేపడుతాం. ఈ పధకం ద్వారా వేలాది మందికి కంటి వెలుగు రావడమే ప్రభుత్వ సంకల్పం.' అని జిల్లా అంధత్వ నివారణ అధికారి డాక్టర్ రామిరెడ్డి తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment