AP Nadu Nedu School Images: మా స్కూల్‌ మారింది చూద్దాం రండి! | Nadu Nedu Schools In AP - Sakshi
Sakshi News home page

Nadu-Nedu Schools: మా స్కూల్‌ మారింది చూద్దాం రండి!

Published Fri, Aug 13 2021 3:23 AM | Last Updated on Fri, Aug 13 2021 11:26 AM

Govt Schools Totally Changed With Naadu Nedu Programme - Sakshi

ఇది ఎల్‌.కోట ఎంపీపీ స్కూలు విజయనగరం జిల్లా లక్కవరపు కోటలోనిది.. అదీ ఊరికి మధ్యలో ఉంది. ప్రహరీ లేకపోవటంతో పందులు, కుక్కలు, పశువులు ఆవరణలోకి వచ్చేసేవి. రాత్రిళ్లు తాగుబోతులు, తిరుగుబోతులకది అడ్డా!. ఇక్కడి హెచ్‌ఎం సింహాద్రి సత్యవతి మాటల్లో చెప్పాలంటే... ‘‘ఉదయం రాగానే మేం చేసే మొదటిపని చెత్త, మద్యం సీసాలు ఎత్తేయించడం, పందులు, కుక్కలు పాడుచేస్తే కడిగించటం. దానికే సగం సమయం పోయేది.

కానీ ‘నాడు–నేడు పుణ్యమాని రూ.17 లక్షల నిధులతో బడి రూపురేఖలు మార్చారు. రంగుల తోరణంలాంటి ప్రహరీ వచ్చింది. సౌకర్యాలూ వచ్చాయి. ఉన్న 72 మంది పిల్లలకు తోడు మరింత మంది చేరుతున్నారు. పిల్లలు బాగుపడే రోజులొచ్చాయి.’’ స్కూళ్లు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతి స్కూలూ.. ప్రతి విద్యార్థీ.. టీచర్లూ ఇదే విధంగా తమ బడి వైభవాన్ని కళ్లకు కడుతున్నారు. వాటిని క్షేత్రస్థాయి నుంచి మీకు వివరిస్తోంది సాక్షి.. 


 


చిత్తూరు జిల్లా మదనపల్లెలోని వెంకటేశ్వరపురం ప్రైమరీ స్కూలుదీ ఇలాంటి కథే. ఆవరణ మొత్తం రాళ్లు రప్పలతో నిండి, చదువుకునే వాతావరణమే కనిపించేది కాదు. ఈ స్కూలు బాగోలేదని రెండేళ్ల కిందట చాలా మంది పిల్లలు చుట్టుపక్కలున్న ప్రైవేటు స్కూళ్లకు వెళ్లిపోయారు. అలాగని ఆ ప్రైవేటు స్కూళ్లేమీ అద్భుతంగా ఉన్నాయనుకోవద్దు. కానీ గత్యంతరం లేక చేరారంతే. ‘‘నాడు–నేడుతో మా పాఠశాల రూపమే మారిపోయింది. ప్రైవేటు స్కూళ్ల నుంచి ఎంతో మంది వచ్చి, ఇక్కడ చేరారు’’ అంటూ సంతోషం వ్యక్తంచేశారు ఇక్కడిఉపాధ్యాయురాలు కవితాబాయి.




ఇవే కాదు. తొలివిడత నాడు–నేడు అభివృద్ధిని చూసిన ప్రతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇపుడిదే సందడి. చదువు విలువ తెలియనిదెవ్వరికి? విలువ తెలుసు కనకే.. మంచి చదువు, నాలుగింగ్లీషు ముక్కల కోసం నిరుపేదలూ వీధి చివరి కాన్వెంట్లకు వెళ్లారు. తలకు మించిన అప్పులూ చేశారు. ‘విలువ’ తెలుసు కనకే..శ్రీమంతులు దీన్ని వ్యాపారం చేశారు. సామ్రాజ్యాలు నిర్మించారు. ‘విలువ’ తెలుసు కనకే గత ప్రభుత్వాలు వీరికి సాగిలపడ్డాయి. ఫలితం... అక్కడక్కడా అప్పుడప్పుడు మెరిసిన నక్షత్రాలు తప్పితే...అందరికీ నాణ్యమైన చదువనేది ఇప్పటికీ అందనిదే!!. 

చెట్లకింద క్లాసులు... బల్లలు కాదు కదా! బోర్డులూ లేని తరగతులు... ఎండకు, వర్షానికి పనికిరాని భవనాలు... ఆనవాళ్లు లేని ప్రహరీలు... బాత్రూమ్‌కైనా, మంచినీళ్లకైనా ఇంటికి పరుగెత్తే పిల్లలు.. సంఖ్యకు తగ్గట్టుగా లేని టీచర్లు... కాన్వెంట్లో తప్ప ఇంగ్లిష్‌ దొరకని సిలబస్‌!!. చెప్పాలంటే ప్రభుత్వ స్కూళ్లు ఎదుర్కొన్న సమస్యల్లో ఇవి కొన్నే. వీటిని పరిష్కరించే చిత్తశుద్ధి మాత్రం గత ప్రభుత్వాలు చేస్తే ఒట్టు!!. ‘చదువు విలువ తెలిసిన వాడిగా చెబుతున్నా’ అనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం అధికారం చేపడుతూనే స్కూళ్లపై దృష్టిపెట్టారు. ‘నాడు–నేడు’ పేరిట ప్రతి స్కూలునూ మార్చే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్నారు. ఇంగ్లిష్‌ మీడియాన్ని అందుబాటులోకి తేవటమే కాదు... ‘అమ్మ ఒడి’ పేరిట చదువుకునే పిల్లలున్న తల్లులకూ ఆర్థిక ఆసరా కల్పించారు. బళ్లు మొదలైనరోజే పుస్తకాలు, యూనిఫారాలతో సహా మొత్తం కిట్లను ‘జగనన్న విద్యాకానుక’గా అందజేస్తున్నారు.  



నిజానికి వేరొక ప్రభుత్వంలో అయితే... ఇలాంటివన్నీ వాగ్దానాలు, భవిష్యత్తులో చేస్తారన్న ఆశలుగానే ఉండేవి. అలాగే మిగిలిపోయేవి కూడా!!. కానీ సీఎం జగన్‌ మాటలకన్నా... చేతలనే నమ్ముతారు. కాబట్టే చేసి చూపించారు. అందుకే తొలివిడతగా రాష్ట్రంలో ఇపుడు 15,715 స్కూళ్లు తమ రూపాన్ని మార్చుకున్నాయి. ఏకంగా రూ.3,900 కోట్లతో... సమగ్ర మౌలిక సదుపాయాలతో, అందంగా ముస్తాబయ్యాయి. పిల్లల్ని రారమ్మంటున్నాయి. ఈ నెల 16న తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇపుడు ప్రతి స్కూలూ... ప్రతి విద్యార్థీ... తల్లిదండ్రులూ... టీచర్లూ ఓ కథ చెబుతున్నారు. తమ బడి వర్తమాన వైభవాన్ని కళ్లకు కడుతున్నారు. ఆ కథలను  క్షేత్ర స్థాయి నుంచి మీకు వివరిస్తోంది ‘సాక్షి’.  
- సాక్షి, అమరావతి / సాక్షి నెట్‌వర్క్‌

మంచి చదువులకు మార్గం సుగమం 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి ప్రాధాన్యతగా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి పరిచే బాధ్యత తీసుకుంది. గతంలో స్కూళ్లల్లోని పరిస్థితిని ఫొటోలు తీయించి అవే స్కూళ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అలా విద్యార్థులకు అత్యుత్తమ బోధన అందించేందుకు వీలుగా... రాష్ట్రంలో  45 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లను ‘మనబడి నాడు–నేడు’ జాబితాలో చేర్చింది. దాదాపు రూ.16 వేల కోట్లు ఖర్చయ్యే ఈ కార్యక్రమంలో తొలివిడతగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేసింది.

ఎల్‌.కోట ఎంపీపీ స్కూలు- లక్కవరపు కోట, విజయనగరం జిల్లా.

వాటిలో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి రూ.3,900 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టి దాదాపు పూర్తి చేయించింది. ఈనెల 16న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ స్కూళ్లను రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తూ విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నారు.  దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన దాఖలాలు వేరెక్కడా లేవన్నది విద్యా రంగ ప్రముఖుల మాట. విద్యా వ్యవస్థను బలోపేతం చేసి, పేదలకు అత్యుత్తమ చదువులను అందుబాటులోకి తేవాలన్న సీఎం జగన్‌ సంకల్ప యజ్ఞంలో తొలి ఘట్టం దిగ్విజయంగా పూర్తయింది.

ప్రతి స్కూలుకూ ప్రహరీ
ఒకప్పుడు స్కూలుకు ప్రహరీ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ప్రతీ స్కూలుకు ప్రహరీ నిర్మించడమే కాకుండా ఆవరణలో అందమైన మొక్కల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా శ్రద్ధ తీసుకున్నారు.   

విద్యార్థి స్కూలులో అడుగు పెట్టగానే అక్కడి వాతావరణం చూసి పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి పెట్టేలా అద్భుతమైన వసతులు కల్పించింది. గతంలో స్కూల్‌ భవనాలు ఎప్పుడు పడిపోతాయో అన్నట్లుగా శిథిలావస్థలో ఉండేవి. ఇప్పుడు వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించింది. 

చిన్న చిన్న పనులతోపాటు పెద్ద పనులు కూడా పూర్తి చేయించి పాఠశాల రూపురేఖలను పూర్తి స్థాయిలో మార్చి వేసింది. పిల్లల సంఖ్యకు అనుగుణంగా ప్రతి స్కూల్లోనూ అదనపు తరగతి గదులను నిర్మించింది.

ముఖ్యంగా పిల్లలను ఆకర్షించే రీతిలో పాఠశాలలకు ఆహ్లాదకరమైన రంగులను వేయించింది. ఈ రంగుల కోసం దాదాపు రూ.412 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పటికే 14,500 స్కూళ్లలో రంగుల కార్యక్రమం పూర్తయింది.   

 


 


కృష్ణా జిల్లా కోట కలిదిండి ఉర్దూ పాఠశాల  

మా ఇద్దరు పిల్లలను కోట కలిదిండి ఉర్దూ పాఠశాలలో చదివిస్తున్నాను. గతంలో ఈ పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతో పశువులు, మేకలు తిరిగేవి. ఉదయం స్కూల్‌కు వెళ్లగానే వాసన వచ్చేది. వాటిని తప్పించుకుంటూ లోపలికి వెళ్లాల్సిన దుస్థితి. నాడు–నేడు పథకం కింద ఇప్పుడు ఈ పాఠశాలను పూర్తిగా మార్చేశారు. రూ.18.18 లక్షలతో కొత్తగా ప్రహరీ, ఇతర వసతులు కల్పించారు. ఎంతో కష్టపడి ఇన్నాళ్లు పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేట్‌ స్కూళ్లలో వేసేవారు. ఇప్పుడా బాధలు తప్పాయి. ప్రభుత్వ స్కూళ్లు అన్ని వసతులతో చక్కగా ఉన్నాయి. పిల్లల చదువు గురించి ఇక దిగుల్లేదు.
-ఎండీ. జరీనా, విద్యార్థుల తల్లి, కోట కలిదిండి, కృష్ణా జిల్లా


 


ప్రకాశం జిల్లా వీకే నగర్‌లోని మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల  

నేను ఇప్పుడు 4వ తరగతిలోకి వెళ్తున్నా. ఇదివరకు మూడేళ్లు బడికి వెళ్లి మట్టిలోనే ఆడుకునేదాన్ని. కాంపౌండ్‌ లేకపోవడంతో పరిసరాల్లో వెళ్తున్న వారిని చూస్తూండటంతోనే సమయం గడిచిపోయేది. బాత్‌రూం కోసం, నీళ్లు తాగడం కోసం తరచూ ఇంటికి పోయేదాన్ని. తిరిగి ఒక్కోసారి బడికి రాబుద్దయ్యేది కాదు. బట్టల నిండా మట్టి అంటుకోవడం వలన అమ్మ చీవాట్లు పెట్టేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మా బడి ఇప్పుడు భలేగా తయారైంది. బడి ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తున్నా. మంచి మంచి బొమ్మలతో కాంపౌండ్‌ వాల్, లోపల మంచి బండలు వేయించారు. అంతా బాగుంది.
-ఎం.నివంతి, వీకే నగర్‌ ఎంపీపీ పాఠశాల, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా




శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం తాళ్లూరు ప్రాథమికోన్నత పాఠశాల 

రోజూ భయపడేవాళ్లం
మాపాప చందన శ్రీని చేర్పించేటప్పుడు ఈ పాఠశాల పరిస్థితి అస్సలు బాగోలేదు. భయపడుతూనే చేర్పించా. ప్రహరీ లేకపోవడం, వెనుకవైపునే చెరువు, బావి ఉండటంతో బిక్కుబిక్కుమంటూ పాపను బడికి పంపాల్సి వచ్చేది. ఇలాగైతే పిల్లలు ప్రమాదాల బారిన పడతారని నిత్యం తల్లిదండ్రులం అనుకుంటుండేవాళ్లం. ప్రస్తుతం నాడు–నేడు కింద ప్రహరీ కట్టడంతో పాటు స్కూల్లో వసతులన్నీ కల్పించారు. గవర్నమెంట్‌ బడికి కూడా ఇలాంటి రోజులు వస్తాయని అస్సలు అనుకోలేదు. 
కె.లక్ష్మీప్రసన్న, విద్యార్థిని తల్లి, తాళ్లూరు, బిట్రగుంట మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement