గోవిందరాజస్వామికి సమర్పించేందుకు జీయర్ స్వాములతో కలసి పట్టువస్త్రాలను తీసుకువస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి
సాక్షి, తిరుపతి: తిరుపతి నగరం 893వ జన్మదిన వేడుకలను శుక్రవారం ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, టీటీడీ, కార్పొరేషన్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం ఎమ్మెల్యే భూమన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పట్టువస్త్రాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ గోవిందరాజుస్వామికి సమర్పించారు.
శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద అర్చకులు, జీయర్‌స్వాముల ఆశీస్సులు తీసుకుని శోభాయాత్రను ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భజన మండళ్ల కళాప్రదర్శనల నడుమ ఆధ్యాత్మికయాత్ర శోభాయమానంగా సాగింది. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులు నిర్వహించిన చెక్క భజనలు, కోలాటాలు, కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
స్వామి భక్తులు పౌరాణిక వేషధారణలో భక్తిప్రపత్తులు చాటుకున్నారు. కనులపండువగా సాగిన యాత్ర ఆద్యంతం.. గోవిందనామ స్మరణతో తిరుపతి పులకించిపోయింది. తమ నగరం పుట్టినరోజును పురస్కరించుకుని నగరాన్ని పచ్చతోరణాలతో అలంకరించారు. పూలు చల్లుతూ, పసుపు నీళ్లు వారబోస్తూ శోభాయాత్రను స్వాగతించారు.
గుమ్మడి కాయలతో దిష్టితీస్తూ, కర్పూర హారతులు పడుతూ భక్తిని చాటుకున్నారు. జగద్గురు శ్రీ రామానుజాచార్యుల చిత్రపటాలను ప్రదర్శిస్తూ ప్రజలు సమతాస్ఫూర్తి ప్రచారకర్తలై ముందుకు సాగారు. పుణ్యక్షేత్ర జన్మదిన వేడుకలు ఏటా కొనసాగాలని జీయర్‌స్వాములు ఆకాంక్షించారు.
భగవంతుడి అనుగ్రహంతోనే..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఎంతో పవిత్రమైందని చెప్పారు. గోవిందరాజుస్వామిని ముక్కోటి దేవతలు పూజిస్తారన్నారు. శ్రీ మహావిష్ణువే శ్రీ వేంకటేశ్వరస్వామి అవతారంలో స్వయంభువుగా వెలిసిన మహాపుణ్యక్షేత్రమిదని తెలిపారు. దైవసమానులైన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యులు 1130 ఫిబ్రవరి 24వ తేదీన శంకుస్థాపన చేసిన ప్రాంతమని చెప్పారు.
ప్రపంచంలో వ్యక్తులకు మాత్రమే జన్మదిన వేడుకలు జరుగుతాయని, అయితే ఓ ప్రాంతానికి జన్మదిన వేడుకలు జరగడమంటే ఒక్క తిరుపతికి మాత్రమేనని పేర్కొన్నారు. ఆ భగవంతుడి అనుగ్రహం వల్లే తాను ఇలాంటి మహోన్నత కార్యక్రమాన్ని చేస్తున్నానని, ఇది పూర్వజన్మ సుకృతమని చెప్పారు. తిరుపతి ప్రాభవాన్ని కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్‌రెడ్డి, ముద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment