అనకాపల్లి: విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అనకాపల్లి ఎంపీ డాక్టర్ బీవీ సత్యవతి చెప్పారు. ఆమె సోమవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఫిబ్రవరి మొదటి వారంలో రైల్వే జోన్ నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సౌత్ కోస్ట్ రైల్వేజోన్ నిర్మాణానికి రూ.170 కోట్లు కేటాయించిందని, భూమిపూజకు రూ.10 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. వడ్లపూడిలో రైల్వేస్థలం 100 ఎకరాలు ఉండగా, జీవీఎంసీ పరిధిలోని ముడసర్లోవలో 52 ఎకరాల స్థలాన్ని రైల్వే అధికారులకు అప్పగించినట్లు వివరించారు.
సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు ఓఎస్‌డీ స్థాయి అధికారిని కేంద్ర ప్రభుత్వం విశాఖలో నియమించిందని పేర్కొన్నారు. ప్రజల అభీష్టాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాన్ని గౌరవించి విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని చెప్పారు. విభజన చట్టంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం దశలవారీగా అమలు చేస్తుంటే.. ‘ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దు..’ అని చెప్పి నగదు తీసుకున్న రోజులను చంద్రబాబు మరిచిపోయినా... జనం ఇంకా గుర్తుంచుకున్నారని ఆమె అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల అభివృద్ధి రాష్ట్రానికి వెన్నెముకలాంటిదని, విజయవాడలో 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దివంగత సీఎం రాజశేఖరరెడ్డి గోదావరి జలాలను ఇచ్ఛాపురం వరకూ అందించాలని పోలవరం ప్రాజెక్టును చేపడితే చంద్రబాబు నాయుడు అడ్డుకున్న రోజులను గుర్తెరగాలని పేర్కొన్నారు. ప్రాజెక్టును పూర్తిచేయాలంటే సుమారు రూ.56 వేల కోట్లు ఖర్చవుతుందని, ఈ విషయంపై కేంద్ర జలవనరుల శాఖమంత్రితో చర్చించామని ఎంపీ సత్యవతి చెప్పారు.
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు భూసేకరణలో ఇబ్బందుల కారణంగా ముందుకు సాగలేదని, చోడవరం మండలంలో ఒక గ్రామ ప్రజలు సహకరించకపోవడంతో పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఉత్తరాం«ధ్ర అభివృద్ధి కోసం చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, ఇతర నేతలు గత ఐదేళ్లలో ఏనాడూ కేంద్ర మంత్రులను కలిసిన పాపానపోలేదన్నారు. వారు ఈ విషయాలపై మాట్లాడడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment