పిఠాపురం: కనుమరుగైపోతున్నాయి అనుకుంటున్న కర్రసాము, కత్తిసాము (శిలంభం) అనే ప్రాచీన యుద్ధ కళలు మళ్లీ జీవం పోసుకుంటున్నాయి. పూర్వం యుద్ధాల్లో ఆయుధంగా వాడిన కర్ర, కత్తి.. ఆ తర్వాత వచ్చి న ఆధునిక ఆయుధాలతో యుద్ధ క్షేత్రం నుంచి కనుమరుగయ్యాయి. అయితే కళగానూ ప్రాచుర్యం పొందిన కర్రసాము, కత్తిసాములను గ్రామీణ ప్రాంతాల్లో యువకులు అభ్యసించేవారు. పెళ్లిళ్లు, పండుగలు, ఊరేగింపులు లాంటి సందర్భాల్లో విన్యాసాలు చేస్తుండేవారు. వీటి సాధనకు గ్రామంలో వ్యాయామ శాలలు (తాలింఖానాలు) ఉండేవి.
గ్రామీణ ప్రాంతాల్లో కర్ర, కత్తి సాము పోటీలు కూడా నిర్వహించేవారు. రానురాను ఈ కళను నేర్చుకునేవారు తక్కువయ్యారు. అయితే ఇటీవల ఈ కళ పట్ల విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. కర్ర, కత్తిసాములపై గ్రామ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అంబాజీపేట, అమలాపురం, పిఠాపురం తదితర ప్రాంతాల్లో శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. సుమారు 300 మంది వీటిల్లో శిక్షణ పొందుతున్నారు.
కర్రసాములో రకాలు
కర్రసాములో ఒంటిబాణా, ఓడిబాణా అనే కర్రలను తిప్పుతూ ఉంటారు. ఇద్దరు పరస్పరం గురిచూసి తిప్పుతూ ఒకరిపై ఒకరు దాడికి యత్నిస్తుంటే దెబ్బ తగలకుండా తప్పించుకోవడం ఇందులో నైపుణ్యం. ఈ సమయంలో వివిధ వాయిద్యాలకు అనుగుణంగా ఈ విద్యను ప్రదర్శిస్తారు. అలాగే కర్రకు నూనెలో తడిపిన గుడ్డ చుట్టి వెలిగించి ఆ మంటలతో కర్రసాము చేస్తూ అబ్బురపరుస్తుంటారు.
ఇదే మాదిరిగా కత్తులతోనూ చేసే విన్యాసాలు, ఈ పోరాటాలలో ఎత్తుకు పైఎత్తు వేస్తూ కత్తిని ఎదుటి వారిపై ప్రయోగించడానికి చేసే ప్రయత్నాలు, తప్పించుకుంటూ ప్రత్యర్థిని ఎదుర్కొనే వ్యూహాలు గగుర్పాటు కలిగిస్తాయి. కత్తిసాములో కత్తి, డాలు ధరించి రకరకాలుగా తిప్పుతూ విన్యాసాలు చేస్తారు. ఒక మనిషిÙని కింద పడుకోబెట్టి అతని శరీరంపై వివిధ పళ్లు, కూరగాయలు ఉంచి నరుకుతుంటే చూస్తూ విస్తుపోవాల్సిందే. మనిషి పొట్టభాగంపై తమలపాకు ఉంచి, దానిపై ఓ పలుచని వస్త్రం వేసి ఆ వస్త్రం చిరగకుండా తమలపాకు రెండు ముక్కలయ్యేలా కత్తితో నరకడం అద్భుతంగా ఉంటుంది.
పోటీలు ఇలా..
జాతీయ స్థాయిలో కర్రసాము, కత్తిసాము పోటీల్లో పాల్గొంటూ స్థానిక రాష్ట్ర యువకులు పతకాలు సాధిస్తున్నారు. కర్రసాము పోటీలను సింగిల్ స్టిక్, డబుల్ స్టిక్, స్వార్డ్, బల్లెం, సురులు, ఫైట్ అనే ఆరు విభాగాలుగా నిర్వహిస్తున్నారు. జిల్లాల్లో ఈపోటీలను నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయి క్రీడాకారులను ఎంపిక చేస్తున్నారు. వీరు జాతీయ స్థాయి పోటీలకు వెళుతున్నారు.
విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది
కర్రసామును క్రీడగా నేర్చుకోవడానికి విద్యార్థులు ముందుకు వస్తున్నారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనడానికి ఏపీ టీంను తయారు చేసి మంచి శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ప్రత్యేక శిక్షణ పొంది జాతీయస్థాయిలో విజేతలయ్యారు. ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ పోటీలు నిర్వహిస్తున్నాం. విజేతలను జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తాం. – టి అబ్బులు, కర్రసాము శిక్షకుడు, పిఠాపురం
రాష్ట్ర స్థాయి స్వర్ణం సాధించాను
పిఠాపురంఆర్‌ఆర్‌బీహెచ్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాను. చిన్నప్పుడు దేవుడి సంబరాల్లో కర్రసాము చేయడం చూసేదానిని. దానిని నేర్చుకోవాలని ఆసక్తి ఏర్పడి నేర్చుకున్నాను. గతంలో కర్రసాములో రాష్ట్ర స్థాయి స్వర్ణ పతకం సాధించాను. మానసికంగా, శారీరకంగా ఎంతో ఉల్లాసాన్నిచ్చే ఈకళను నేర్చుకోవడం ఆనందంగా ఉంది. – పి నిర్మల, కొండెవరం
ఆత్మరక్షణకు ఈ కళను నేర్చుకున్నా
నేను ఏడో తరగతి చదువుతున్నాను. ఆత్మ రక్షణలో మెళకువల కోసం కర్రసాము నేర్చుకున్నా. రాష్ట్ర, జిల్లా స్థాయి పోటీలలో పాల్గొన్నాను. కొండెవరంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో రజత పతకం సాధించాను. ఎక్కడ పోటీలు జరిగినా వెళ్లి పతకం సాధించడానికి ప్రయత్నం చేస్తుంటాను. – షేక్ అమీద, పిఠాపురం
Comments
Please login to add a commentAdd a comment