సత్తెనపల్లి: గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తుపాకీ కలకలం రేపింది. ఏకంగా ఓ సివిల్ కాంట్రాక్టర్‌ను ఇంటి విషయంలో తుపాకీతో బెదిరించిన ఘటన సంచలనంగా మారింది. పట్టణానికి చెందిన వాకుమళ్ల చెంచిరెడ్డి ప్రభుత్వ నిర్మాణ పనులు చేస్తూ సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. 2019లో సత్తెనపల్లి మండలం కందులవారిపాలేనికి చెందిన కందుల వెంకట్రావమ్మకు పట్టణంలోని మూడు పోర్షన్ల ఇంటిని రూ.58 లక్షలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఒప్పందం ప్రకారం రూ.34 లక్షలు చెల్లించి మిగిలిన పైకం నెలలోపు చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని వెంకట్రావమ్మ చెప్పింది. అయితే నెలలోపు మిగతా మొత్తాన్ని చెల్లించకుండా రూ.3.20 లక్షలే చెల్లించింది.
ఇల్లు శ్రీరామ్ చిట్స్‌లో తనఖాలో ఉందని, నగదు మొత్తం అనుకున్న గడువు ప్రకారం చెల్లిస్తే రుణం క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తానని చెంచిరెడ్డి చెప్పాడు. కానీ వెంకట్రావమ్మ నగదు చెల్లించకుండానే ఒప్పందం జరిగిన ఇంట్లో ఉంటూ మిగిలిన పోర్షన్లను అద్దెకిచ్చింది. ఇంటిని తన పేరిట రిజిష్టర్ చేయించాలంటూ ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 24న చెంచిరెడ్డి వావిలాల పార్కు వద్ద వాకింగ్ చేస్తుండగా వెంకట్రావమ్మ కుమారుడు కందుల మాధవరెడ్డి వచ్చి తుపాకీతో బెదిరించాడు. ఇంటిని తన తల్లి పేర్న రిజిస్టర్ చెయ్యకుంటే చంపుతానంటూ హెచ్చరించాడు.
ఇది బొమ్మ తుపాకీ కాదని, నిజంగా తుపాకీయేనని దానిని చెంచిరెడ్డి చేతిలో పెట్టాడు. ఈ నేపథ్యంలో చెంచిరెడ్డి ఈ నెల 28న పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆదివారం వెంకట్రావమ్మ ఇంట్లో సోదాలు నిర్వహించి తుపాకీని, ఐదు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మాధవరెడ్డి, వెంకట్రావమ్మను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మాధవరెడ్డి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నట్టు పట్టణ సీఐ విజయచంద్ర చెప్పారు.
బొమ్మ తుపాకీ అనుకున్నావా?.. నిజంగా తుపాకీనే!
Published Tue, Mar 30 2021 5:55 AM | Last Updated on Tue, Mar 30 2021 5:55 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment