గుణదల కొండపై భక్తుల సందడి
గుణదల (విజయవాడ తూర్పు): గుణదల మేరీమాత పుణ్యక్షేత్రంలో రెండు రోజులుగా జరుగుతున్న మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజైన బుధవారం భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. లక్షలాదిగా వచ్చిన యాత్రికులు మరియమాత దర్శనం కోసం బారులు తీరారు. మరియమ్మ నామ స్మరణతో గుణదల కొండ మార్మోగింది. భక్తులు కొండ పైన కొలువుదీరిన మరియతల్లిని దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. కొండ దిగువన ఉన్న బిషప్ గ్రాసి పాఠశాల ప్రాంగణంలో డయాసిస్ గురువులు సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు.
ముఖ్యఅతిథిగా హాజరైన నెల్లూరు కథోలిక పీఠం బిషప్ మోస్ట్ రెవ.మోజెస్ దొరబోయిన ప్రకాశం మాట్లాడుతూ.. లోకమాతగా నీరాజనాలందుకుంటున్న మరియమాతను ఆశ్రయించి ఆమె దీవెనలు పొందాలని కోరారు. అనంతరం సమష్టి దివ్యబలిపూజ సమర్పించి భక్తులకు సత్ప్రసాదాన్ని అందజేశారు. విజయవాడ డయాసిస్ బిషప్ తెలగతోటి జోసెఫ్ రాజారావు, మోన్సిగ్నోర్ మువ్వల ప్రసాద్, పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ యేలేటి విలియం జయరాజు తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన దివ్యబలి పూజలో విశాఖపట్నం బిషప్ మల్లవరపు ప్రకాష్ హాజరై దేవుని వాక్య సందేశం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment