రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేస్తున్న గురుమూర్తి. చిత్రంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తిరుపతి పార్లమెంట్ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా డాక్టర్ ఎం.గురుమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. 9 మంది రాష్ట్ర మంత్రులు, ఇద్దరు ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, టీటీడీ చైర్మన్ తదితరులతో కలిసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులో కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేవీఎన్ చక్రధర్‌బాబుకు 3 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. తొలుత నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మంత్రులు, పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వీఆర్‌సీ సెంటర్‌లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మొదటి సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.
మునిసిపల్ తీర్పు పునరావృతం
ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ సీఎం జగన్ పాలనకు ప్రజలు మునిసిపల్ ఎన్నికల ద్వారా బలమైన తీర్పు ఇచ్చారని చెప్పారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లోనూ అదే తీర్పు పునరావృతమవుతుందని పేర్కొన్నారు. దేశం మొత్తం చూసేలా భారీ మెజార్టీ తప్పక సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కులాలు, పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందుతున్నాయన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చిన్న కుటుంబం నుంచి వచ్చిన విద్యావంతుడు గురుమూర్తి ఒక వైపు, ఇద్దరు కేంద్ర మాజీ మంత్రులు, ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇలా హేమాహేమీలు మరోవైపు బరిలోకి దిగారని చెప్పారు. గురుమూర్తి గెలుపు ఎప్పుడో ఖాయమైందన్నారు. రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం ఆలోచించే రీతిలో భారీ మెజార్టీ సాధించడానికి తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నామన్నారు. సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తున్న సీఎం రుణం తీర్చుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.
నెల్లూరులో నామినేషన్ వేసేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గురుమూర్తి
5 లక్షల మెజారిటీ సాధిస్తాం
మంత్రి అనిల్ యాదవ్ మాట్లాడుతూ ఎలాంటి ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగా నామినేషన్ దాఖలు చేయడానికి వస్తేనే పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారని చెప్పారు. దేశమంతా ఆసక్తిగా చూస్తున్న పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 5 లక్షల మెజార్టీ సాధిస్తామన్నారు. ఈ ఎన్నికలు రెఫరెండం కాదని చెప్పి టీడీపీ ముందే చేతులెత్తేసిందన్నారు. జగన్ 21 నెలల పరిపాలనకు ప్రజలు భారీ మెజార్టీతో తిరుపతి పార్లమెంట్ స్థానం కానుకగా ఇవ్వనున్నారని పేర్కొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ దళిత వర్గానికి చెందిన సామాన్యడైన గురుమూర్తిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీడీపీ, బీజేపీ ఉనికి కాపాడుకోడానికి డ్రామాలకు తెరతీశాయని విమర్శించారు.
ర్యాలీకి భారీగా హాజరైన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, ప్రజలు
ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణస్వామి, బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి గౌతమ్‌రెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, కన్నబాబు, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, నల్లపరెడ్డి ప్రసనకుమార్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్, కిలివేటి సంజీవయ్య, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్‌చక్రవర్తి, పార్టీ నాయకుడు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment