సాక్షి,పార్వతీపురంటౌన్(శ్రీకాకుళం): ఆయన ఓ హెడ్ కానిస్టేబుల్. ఏ స్టేషన్‌లో పనిచేసినా ఆయనకో ప్రత్యేక గుర్తింపు. జీతం డబ్బులతో పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం చేస్తారు. స్టేషన్‌కు వచ్చే పేద ఫిర్యాదుదారులకు కడుపునిండా భోజనం పెట్టి మానవత్వాన్ని చాటుకుంటారు. సమస్యను ఫిర్యాదు రూపంలో నమోదు చేస్తారు. పేదవృద్ధులకు అండగా నిలుస్తున్నారు. సేవలతో అందరికీ సుపరిచితుడై, సేవక భటుడిగా పేరు పొందారు. ఆయనే.. పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొమిరి కృష్ణమూర్తి. ఆయన దాతృత్వాన్ని ఓ సారి పరికిస్తే...
కృష్ణమూర్తిది వీరఘట్టం మండలం కొట్టుగుమడ గ్రామం. ఉపాధ్యాయుడిగా స్థిరపడాలన్నది ఆయన కోరిక. పోలీస్ ఎంట్రన్స్ పరీక్షలో ప్రతిభ కనబరచడంతో 1993వ సంవత్సరంలో పోలీస్ కానిస్టేబుల్‌గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పేద వృద్ధులు, దివ్యాంగులు, విద్యార్థులకు తన వంతుగా ఆర్థికసాయం చేస్తున్నారు. ఆయన పేరుకే పోలీస్.. కానీ మృధుస్వభావి, మానవతావాది. సమస్యలతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చేవారిని ఆప్యాయంగా పలకరిస్తారు. ఆపై వారి సమస్యలను సానుకూలంగా తెలుసుకొని రైటర్‌గా తనపనిని పూర్తిచేస్తారు. సమయానికి అనుగుణంగా వారికి భోజనం పెడతారు. తన సేవలను గుర్తించిన అప్పటి ఎస్పీ పాలరాజు ఆయనను వృద్ధమిత్ర, కోఆర్డినేటర్‌గా నియమించారు.
మేము నాయీ బ్రాహ్మణులం. మా తండ్రి వ్యవసాయంతో పాటు కులవృత్తిచేసేవారు. ఆ రోజుల్లో వచ్చిన నెలసరి ఆదాయంలో ఇంటి అవసరాలకు పోను మిగిలిన మొత్తాన్ని పేదలకు దానంచేసేవారు. కష్టాల్లో ఉన్నారని తెలిస్తే తనకు తోచిన సహాయాన్ని చేసేవారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నెలజీతంలో కొంతమొత్తాన్ని పేదలకు వెచ్చిస్తున్నాను. అబ్దుల్ కలాం రచించిన పుస్తకాలను, ఆయన జీవిత చరిత్రను చదివాను. ఆయనే నాకు స్ఫూర్తి. ఉద్యోగవిరమణ పొందిన తరువాత వచ్చిన మొత్తంతో పేద పిల్లల కోసం ప్రత్యేకంగా పాఠశాల నిర్మిస్తాను. పేదలకు సహాయం చేయడంలో ఉన్న సంతృప్తిని లెక్కించలేను.
– కృష్ణమూర్తి, హెడ్‌కానిస్టేబుల్, పార్వతీపురం టౌన్ స్టేషన్
మానవసేవే మాధవ సేవగా...
ఆయన తన నెలవారీ జీతంలో సుమారు రూ.5వేల నుంచి రూ.10వేల వరకు సేవలకు వెచ్చిస్తున్నారు. పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు, నిఘంటువులు, దేశ నేతల జీవితగాథల పుస్తకాలు, పెన్నులు కొనుగోలు చేసి అందజేస్తున్నారు. పేద వృద్ధులకు, దివ్యాంగులకు ప్రతినెలా నిత్యావసర సరుకులు, దుప్పట్లు, చీరలు సమకూర్చుతున్నారు. కొంత ఆర్థిక సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఆయన సేవా నిరతిపై అధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. వృద్ధమిత్ర కో ఆర్డినేటర్‌గా అందిస్తున్న సేవలను ఆర్యవైశ్య ధర్మశాలలో పార్వతీపురం గత ఆర్డీఓ సుదర్శన్ దొర, సీఐ సంజీవరావు, వయో వృద్ధుల సంక్షేమ ప్రతినిధి జె.సీతారాములు ఘనంగా సత్కరించారు. 2010 నుంచి 2021వరకు ఏటా ఆయనను పలువురు పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సత్కరించాయి.
Comments
Please login to add a commentAdd a comment