సాక్షి,విజయవాడ : కేరళలో కోవిడ్ కేసులు పెరుగుతున్నందునే కేంద్రం అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేసిందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్ సీఎస్ ఎం.టి కృష్ణబాబు తెలిపారు. ఈ విషయమై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కేసుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు.
‘ఏపీ నుంచి ఈ సీజన్‌లోలో కేరళ వెళ్లే అయ్యప్ప భక్తులు ఎక్కువ ఉంటారు. శబరిమల వెళ్లి వచ్చిన భక్తులకి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించాం. 12 మెడికల్ కళాశాలల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం’ అని తెలిపారు. ‘ప్రతీ గ్రామ సచివాలయానికి పది ర్యాపిడ్ కిట్లు పంపించాం. ఫీవర్ ఉన్న వారికి ర్యాపిడ్ కిట్లతో ముందుగా పరీక్షలు చేస్తాం. ఇందులో పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్ ఆర్టీపీసీఆర్ ల్యాబులకు పంపేందుకు ఏర్పాట్లు చేశాం. పాజిటివ్ వచ్చిన వారిలో కోవిడ్ వేరియంట్ తెలుసుకోవడానికి విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లో పరీక్షలు చేస్తాం’ అని చెప్పారు.
జ్వరం, పొడి దగ్గు, డయేరియా లాంటి లక్షణాలు జెఎన్ 1 కొత్త వేరియంట్‌లో కనిపిస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒమిక్రాన్ కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మాస్క్ ధరించడం లాంటి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏపీలో 33 వేలకి పైగా ఆక్సిజన్ బెడ్స్, 6 వేలకి పైగా ఐసీయూ బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్లకు, కోవిడ్ మందులకి కొరత లేదు’అని కృష్ణబాబు తెలిపారు.
ఇంకా ఆయన ఏమన్నారంటే..
రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులలో ఏర్పాటు చేసిన RTPCR ల్యాబ్ లను క్రియాశీలకం చేయాలి. రోజుకు కనీసం వెయ్యి పరీక్షలు నిర్వహించేలా సిద్ధం కావాలి. విలేజ్ హెల్త్ క్లినిక్ లకు ర్యాపిడ్ టెస్ట్ కిట్లను సిద్ధం చేయాలి. ఫ్లూ జ్వరం లేదా శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగులకు RTPCR టెస్ట్ లను తప్పనిసరి చేయాలి. గ్లౌజ్‌లు, మాస్క్ లు, శానిటైజర్లు వంటి రక్షణ పరికరాలను అన్ని ఆస్పత్రులలో సిద్ధంగా వుంచుకోవాలి. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారికి అవసరమైన ఆక్సిజన్ సరఫరా కోసం LMO, PSA, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వంటి వాటిని, డి టైప్ సిలిండర్లను సిద్ధంగా ఉంచాలి. జ్వరం, దగ్గు వంటి ఎటువంటి స్వల్ప లక్షణాలు కన్పించినా సంబంధిత వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండాలి.
దీనితో పాటు రానున్న పండుగ సీజన్లలో అన్ని ప్రాంతాలలో రద్దీ పెరుగనున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు పాటించాలని ప్రజల్ని కోరారాయన. శబరిమలై యాత్రకు వెళ్లే భక్తులు తగినంత ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, వారిలో ఎటువంటి వ్యాధి లక్షణాలు కన్పించినా వారు తక్షణణం దగ్గరలోని విలేజ్ క్లనిక్ లో పరీక్షలు చేయించుకుని ఆరోగ్య పరిస్థితిని నిర్ధారించుకోవాలని సూచించారు. అయితే ప్రస్తుతం ఏ విధంగానూ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదని, తాము ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వీలుగా నిరంతరం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని, ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు
మన రాష్ట్రంలో కోవిడ్ కేసులు తాజాగా ఇప్పటి వరకూ ఒక్కటి కూడా నమోదు కాలేదని, అయితే కేరళ వంటి రాష్ట్రాలలో కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మనం అత్యంత జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుందని వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అన్నారు. గ్రామ సచివాలయ స్థాయిలో వున్న విలేజ్ క్లినిక్ లు అన్నింటికీ యాంటిజెన్ టెస్ట్ కిట్లు ఇప్పటికే అందచేశామని ఆయన చెప్పారు. అక్కడ ఏదైనా పాజిటివ్ గా నిర్ధారణ అయితే దానిని ఆర్టీపీసీఆర్ టెస్ట్ కు పంపటానికి వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో టెస్ట్ లకు అవసరమైన సౌకర్యాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. అక్కడ కూడా పాజిటివ్ నిర్ధారణ అయితే విజయవాడలో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపి వేరియంట్ ను గుర్తించి దాని వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కేరళ, తమిళనాడు తరహాలో మన రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఇటువంటి సమస్య తలెత్తలేదని, అయితే మనం ముందు జాగ్రత్త పాటించటం అత్యవసరమని ఆయన స్పష్టం చేశారు. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ లు ధరించటం, సామాజిక దూరం పాటించటం, పరిశుభ్రతను పాటించటం వంటి చర్యల ద్వారా వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment