సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాల్సిందేనని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్ షరతుల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించింది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అధికారులను బెదిరిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చింది. వచ్చే ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తామని.. ఆ తర్వాత చంద్రబాబు కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్నారని నివేదించింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం న్యాయమూర్తులు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.
ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక స్కిల్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ఏపీ సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇలా చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేది జోక్యం చేసుకొని రికార్డుల్లో లేని అంశాలను పరిగణనలోకి తీసుకోబోమని తెలిపారు. దీంతో చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రకటనలకు సంబంధించి అదనపు డాక్యుమెంట్లు అందజేయడానికి ఏపీ సీఐడీ అనుబంధ పిటిషన్ దాఖలు చేశామని రోహత్గి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ ఏం కోరుకుంటోందని జస్టిస్ బేలా ఎం త్రివేది ప్రశ్నించగా.. చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని రోహత్గి విన్నవించారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తోందని, ఈ సమయంలో బెదిరింపు ప్రకటనలను తేలిగ్గా తీసుకోరాదని తెలిపారు. చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన అప్పీల్ కోర్టు ముందుందన్నారు. నిందితుడి కుటుంబ సభ్యుడి తీరు దిగ్భ్రాంతికరంగా ఉందని.. అధికారుల పేర్లన్నీ ఒక పుస్తకంలో రాస్తున్నట్లు చెబుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వీరి పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున బెదిరింపు ప్రకటనలు చేసేవారికి బెయిల్ ప్రయోజనం, స్వేచ్ఛ లభించకూడదన్నదే తమ ఉద్దేశమన్నారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని కోర్టుకు విన్నవించారు.
చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తూ సీఐడీ అనుబంధ పిటిషన్‌పై స్పందించడానికి తమకు సమయం కావాలని కోరారు. దీంతో రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అవసరమనుకుంటే పిటిషనర్ కూడా స్పందించవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment