సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజల సంక్షేమ కోసం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు ప్రజా సంక్షేమ పథకాలకు దురుద్దేశాలను ఆపాదించడంతో పాటు వాటి వల్ల పలువురికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలున్నాయని, వాటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులు 41 మందిలో నోటీసులు అందుకున్న వారందరూ ఈ పిల్ విచారణార్హతపై కౌంటర్లు దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
విచారణార్హతపై కౌంటర్లు దాఖలు చేసిన తరువాత వాటిని రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది ఉన్నం శ్రవణ్‌కుమార్‌కు అందజేయాలని ప్రతివాదుల తరఫు న్యాయవాదులను ఆదేశించింది. కౌంటర్లు అందుకున్న తరువాత వాటికి సమాధానం (రిప్‌లై) దాఖలు చేయాలని శ్రవణ్ కుమార్‌ను ఆదేశించింది. ఈ నెల 23న పిల్ విచారణార్హతపై వాదనలు వింటామంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మండవ కిరణ్మయి ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నోటీసుల జారీపై ఆరా తీసిన ధర్మాసనం..
అంతకుముందు ఈ పిల్ విచారణకు రాగానే, గతంలో తాము ప్రతివాదులకు జారీ చేసిన నోటీసులు ఎవరికి అందాయి, ఎవరికి అందలేదో ధర్మాసనం ఆరా తీసింది. కొందరికి ఈ–మెయిల్ ద్వారా నోటీసులు పంపామని రఘురామకృష్ణ తరపు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు తెలిపారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఇప్పటికే కౌంటర్ దాఖలు చేశారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వివరించారు.
ప్రతివాదులందరికీ నోటీసులు అంది, వారు కౌంటర్లు దాఖలు చేసిన తరువాతే పిల్ విచారణార్హతపై వాదనలు వింటామని గత విచారణ సమయంలో మీరు (ధర్మాసనం) చెప్పారని ఏజీ గుర్తు చేశారు. మిగిలిన అధికారిక ప్రతివాదులందరూ సీఎస్ కౌంటర్‌నే అన్వయింపచేసుకుంటారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) వేలూరి మహేశ్వరరెడ్డి తెలిపారు. దీంతో ధర్మాసనం నోటీసులు అందుకున్న అనధికారిక ప్రతివాదులందరూ కౌంటర్లు దాఖలు చేయాలని, ఆ కాపీలను పిటిషనర్ న్యాయవాదికి అందచేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment