మిర్చి బస్తాలతో పూర్తిగా నిండిపోయిన గుంటూరు మిర్చి యార్డు
సాక్షి, అమరావతిబ్యూరో: గుంటూరు మిర్చి యార్డుకు పెద్ద ఎత్తున సరుకు వచ్చి చేరుతోంది. దీంతో యార్డు ప్రాంగణం మిర్చి టిక్కీలతో నిండిపోయింది. సరుకుతో నిండిన వాహనాలు భారీ సంఖ్యలో రోడ్డుపైనే నిలిచిపోయాయి. ప్రస్తుతం సోమవారం నాటికి యార్డులో 3.5 లక్షల టిక్కీల బస్తాలు నిల్వలున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో యార్డులో సిబ్బంది, దిగుమతి, ఎగుమతి వ్యాపారులు, కార్మికులు హడలిపోతున్నారు. రాయలసీమ, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి రైతులు పెద్ద ఎత్తున సరుకు తీసుకువస్తున్నారు. యార్డు ప్రాంగణం అంతా మిర్చి బస్తాలతో నిండిపోవడంతో శానిటైజ్ చేసేందుకు వీలు కావటం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం కూడా యార్డుకు వచ్చే మొత్తం సరుకును కలిపి బయటకు పంపేందుకు చర్యలు తీసుకొంటున్నారు. యార్డు పరిసరాలను శానిటైజ్ చేసి, కోవిడ్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే దిశగా యార్డు చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, సెక్రటరీ వెంకటేశ్వరరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఈనెల 21 నుంచి 25 వ తేదీ వరకు యార్డుకు సెలవులు ప్రకటించారు.
పెద్ద ఎత్తున సరుకు ఎందుకు వస్తోందంటే..
సకాలంలో వర్షాలు కురవటంతో కాలువలకు సాగు నీటిని పుష్కలంగా విడుదల చేశారు. ప్రధానంగా మిర్చి పంట అధికంగా పండే గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో నాగార్జున సాగర్ కుడికాలువలకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ 12 వ తేదీ వరకు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మిర్చి దిగుబడులు ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. ప్రధానంగా ఈ ఏడాది సాధారణ రకం మిర్చి రకాలు 334, నెంబరు 5341, సూపర్ 10 వంటి రకాలు సైతం మంచి ధర పలుకుతున్నాయి. వీటి ధర ప్రస్తుతం రూ.11 వేల నుంచి రూ.13 వేలు పలుకుతోంది. ఈ నేపథ్యంలో రైతులు మిర్చి సరుకును అమ్ముకునేందుకు యార్డుకు తరలిస్తుండటంతో యార్డు పూర్తిగా నిండిపోతోంది. హైబ్రిడ్ రకాలను రైతులు కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసుకుంటున్నారు.
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు..
రైతులకు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. యార్డులోకి వచ్చే రైతులకు మాస్క్ లేకపోతే, గేటులో ఉచితంగా మాస్క్ ఇస్తున్నాం. శానిటైజ్ చేసుకుని లోపలికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. అనారోగ్య పరిస్థితులు ఉంటే రైతులను యార్డులోకి అనుమతించటం లేదు. యార్డును పూర్తిగా సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రపరిచేందుకు వీలుగా సెలవులు ప్రకటించాం.
– వెంకటేశ్వరరెడ్డి, మిర్చి యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment