మినీ లారీ సాయంతో ఆటోను లాగుతున్న దృశ్యం
రామసముద్రం : మండల పరిధి రామసముద్రంలోని చెంబకూరు ప్రాంతంలో బుధవారం భారీ వర్షం కురవడంతో రాకపోకలు స్తంభించాయి. గంట పాటు కురుసిన వర్షంతో చెరువులు, కాలువలు నిండిపోయాయి. పంట పొలాలపై వరదనీరు ప్రవహించడంతో రైతులు నష్టపోయారు. మనేవారిపల్లె గ్రామానికి వెళ్లే రోడ్డు, పంట పొలాలు పూర్తిగా దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయి.
నడింపల్లె వడ్డివానిచెరువు గండి పడడంతో ఎస్‌ఐ రవీంద్రబాబు సహకారంతో గ్రామస్తులు గండిని పూడ్చారు. పై గడ్డ ప్రాంతంలో శ్రీనివాసపురం–రామసముద్రం రోడ్డుపై నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మూగవాడి ఉన్న గౌనివాని కాలువ వరద నీటితో ప్రవహించింది. ఇంత పెద్ద ఎత్తున వర్షం కురవడం ఇదే మొదటి సారిని ప్రజలు తెలిపారు.
అలాగే నారిగానిపల్లె పంచాయతీ పూలగుంట్ల గ్రామంలో లక్ష్మన్నకు చెందిన ఆరు గొర్రెలు కాలువ దాటే సమయంలో వరదనీటికి కొట్టుకుపోయాయి. గొర్రెల కాపరులు వరదనీటిలో కొట్టుకెళ్తుండగా గ్రామస్తులు రక్షించారు. ఈ భారీ వర్షంతో టమాట, కాలీఫ్లవర్, కొత్తిమీర తదితర పంటలు దెబ్బతిన్నాయి. వడ్డిపల్లె, నడింపల్లె చెరువులను ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు.
సంపతికోట ఏటిలో తప్పిన ప్రమాదం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని సంపతికోట ఏటిలో గురువారం మళ్లీ నీటి ప్రవాహం వరదలా ఉప్పొంగింది. సంపతికోట నుంచి గుడిపల్లికి పాల ఆటో వెళ్తూ ఏటిలో అదుపు తప్పి బోల్తా పడింది. పాలన్నీ నీటి పాలయ్యాయి. అయితే అక్కడే ఉన్న ఓ మినీ లారీ సాయంతో ఆటోను ఒడ్డు వైపు లాగడంతో పెను ప్రమాదం తప్పిందని గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
నాలుగు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో ఇదే ఏటిలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు చిక్కుకుని ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటనలో ఇంజనీరింగ్ చదివే ఓ యువతి నీటిలో కొట్టుకుపోయి అర్ధాంతరంగా తనువు చాలించిన విషయం తెలిసిందే. ఎగవనున్న కర్టాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చెరువులు నిండి మిగులు వరదలా ప్రవహిస్తుండటంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంపతికోటకు చేరుకుని వరద ఉద్ధృతిని పరిశీలించి వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు.
Comments
Please login to add a commentAdd a comment