డిసెంబర్‌ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లు | Help Desk Will Arrange In Arogyasri Hospitals In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌ డెస్క్‌లు

Published Wed, Nov 18 2020 11:09 PM | Last Updated on Wed, Nov 18 2020 11:11 PM

Help Desk Will Arrange In Arogyasri Hospitals In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : వచ్చే నెల 10వ తేదీ నాటికి ఆరోగ్య శ్రీ ఆస్పత్రులన్నింటిలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌ డెస్క్‌లు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో డిసెంబర్‌ 10 నాటికి ఆరోగ్య మిత్రలతో హెల్ప్‌ డెస్క్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య మిత్రలకు శిక్షణ కార్యక్రమం కూడా ముగించాలని చెప్పారు.

హెల్ప్‌ డెస్కులలో ఆరోగ్యమిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్‌ఓపీ ఖరారు చేయాలని సూచించారు. ‘హెల్‌‍్ప డెస్క్‌లలో ఎందుకు కూర్చున్నాము? ఏం చేయాలి? తనపై సీసీ కెమెరా నిఘా ఎందుకు ఉంది? తాను రోగులకు ఏ రకంగా సహాయం చేయాలి?’ అన్న దానిపై ఆరోగ్యమిత్రలకు స్పష్టమైన అవగాహన ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతోందన్నది జేసీలు చూడాలన్నారు. అస్పత్రులలో 9,800 పోస్టులు మంజూరు చేశామని, వాటిలో జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో 7,700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 5,797 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీ చేసేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

25న జగనన్న తోడు 
- జగనన్న తోడు పథకం నవంబర్‌ 25న ప్రారంభం అవుతుంది. వీధుల్లో చిరు వ్యాపారులకు ఐడీ కార్డులు ఇవ్వడంతో పాటు, వారికి వడ్డీ లేకుండా రూ.10 వేల రుణం ఇస్తాం. వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు కడుతుంది. 
- ఈ పథకంలో ఇప్పటి వరకు 6.29 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు టైఅప్‌ అయ్యాయి. మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే బ్యాంకులకు పంపాలి. ఈ నెల 24వ తేదీలోగా బ్యాంకులతో లబ్ధిదారులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని కలెక్టర్లు పూర్తి చేయాలి. 

జాతీయ ఉపాథి హామీ పనులు 
- జాతీయ ఉపాథి హామీ పనులు బాగా జరుగుతున్నాయి. ఇంకా కొన్నింటిపై ఫోకస్‌ పెట్టాల్సి ఉంది. దాదాపు రూ.150 కోట్ల విలువైన పనులు ఒక్కో వారంలో జరుగుతున్నాయి. 
- అయితే కేవలం రూ.150 కోట్లు మాత్రమే బకాయి ఉండగా, ‘ఈనాడు’ పూర్తిగా తప్పుడు వార్తలు రాస్తోంది. గ్రామాల్లో పనులకు ఎవ్వరూ రాకుండా కుటిల ప్రయత్నం ఇది. బిల్లులు ఇవ్వడం లేదని తప్పుడు వార్తలు రాస్తోంది.

ఇవి సకాలంలో పూర్తి కావాలి
- గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ), వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 నాటికి పూర్తి కావాలి. 
- బీఎంసీయూల నిర్మాణానికి సంబంధించి ఆర్బీకేల పక్కనే భూములు ఇచ్చేలా చూడండి. ఈ నెల 30 నాటికి స్థలం ఇవ్వడంతో పాటు, అన్నీ మంజూరు చేయాలి. వచ్చే నెల 15 నాటికి తప్పనిసరిగా పనులు మొదలు కావాలి.
- ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్ల విలువైన పనులు చేయాలి. సకాలంలో అవి పూర్తి చేస్తే, అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులు వస్తాయి. అన్ని పనుల్లో గ్రామ, సచివాలయాల్లో ఉన్న గ్రామ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి.

నాడు-నేడు (స్కూళ్లలో)
- నాడు-నేడు కింద తొలి దశలో 15,715 స్కూళ్లలో పనులు చేపట్టగా, 78 శాతం పూర్తయ్యాయి. డిసెంబర్‌ 31 టార్గెట్‌గా పనులు పూర్తి చేయాలి. దీనిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. బాత్‌రూమ్‌ల శ్లాబ్‌ వంటి పనులు జరగాల్సిన 262 చోట్ల అవసరమైన ఇసుక, సిమెంటు సరఫరా చేయాలి. 
- పేరెంట్‌ కమిటీలపైనే పూర్తి భారం వేయకుండా జేసీలు బాధ్యత తీసుకుని ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్షించాలి. 

జగనన్న విద్యా కానుక 
- పిల్లలకు కిట్‌ ఇచ్చాం. అందులో ఏమైనా లోపాలు ఉంటే, వాటిని సరిచేయండి. నాణ్యతపై పూర్తి దృష్టి పెట్టాలి. పిల్లలు ఎవరికైనా షూ సైజ్‌ సరిపోకపోయినా, లేక పెద్దగా అయినా తెలుసుకోండి. ఆ మేరకు ప్రతి స్కూల్‌లో నోటీసులు పెట్టి, పూర్తి వివరాలు సేకరించండి. 
- పిల్లలను వాటిని స్కూల్‌కు స్వయంగా తీసుకురమ్మని చెప్పి, అక్కడే పరిష్కారం చూపాలి. ఒక వేళ బ్యాగ్‌ ఎలా ఉందో చూడండి. చినిగిపోతే క్వాలిటీ పెంచాలి. పిల్లలకు అది ఒక ప్యాషన్‌. వారు బాగా చదువుకోవాలి. కాబట్టి కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 
- పిల్లలకు మూడు జతల యూనిఫామ్‌ కుట్టుకూలీ తల్లుల ఖాతాలో పడుతుందా? లేదా? అన్నది కూడా చూడాలి. వచ్చే సోమవారం నుంచి ఈ కార్యక్రమం జరగాలి.
 
అంగన్‌వాడీ కేంద్రాలు (వైఎస్సార్‌ ప్రిప్రైమరీ స్కూళ్లు) 
- రాష్ట్రంలో 27,543 అంగన్‌వాడీలు అద్దె భవనాల్లో ఉన్నాయి. సొంత భవనాల నిర్మాణం కోసం 22,630 స్థలాలు గుర్తించారు. 
- ఊరిలోకి రాగానే సచివాలయం, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్, ఆర్బీకే, ప్రిప్రైమరీ స్కూల్‌.. ఇలా అన్నీ కనిపిస్తాయి. అంత చక్కటి పరిస్థితి మీరు చేశారంటే, మీ హయాంలో జరిగిందని అందరూ చెప్పుకుంటారు. అలా మీరు గుర్తుండిపోతారు. కాబట్టి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 

వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌లు
- వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు భవిష్యత్తులో గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురానున్నాయి. వాటిలో హెల్త్‌ అసిస్టెంట్లు ఉంటారు. ఆశా వర్కర్లు కూడా ఉంటారు. ఏ నిర్మాణంలో అయినా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. జేసీలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ 
- ఏ పంట అయినా అమ్ముడుపోకుండా ఉంటే, దానిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి. రైతులకు కనీస మద్దతు ధర ఇస్తూ గ్రామ స్థాయిలో ధాన్యం సేకరిస్తున్న ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందాం. 
- ఆర్బీకేల స్థాయిలో 5,812 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. వాటిలో వివిధ పంటలకు సంబంధించి 4,29,481 మంది రైతులు ఆర్బీకేల వద్ద పేర్లు నమోదు చేసుకున్నారు. వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, రాగి తదితర పంటలకు సంబంధించి రైతులు రిజిస్టర్‌ చేసుకున్నారు. 
- ఆర్బీకేల వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న తర్వాత 15 రోజుల లోపలే ధాన్యం కొనుగోలు చేయాలి. అంత కంటే ఆలస్యం చేయొద్దు. రైతుల వివరాలు, సేకరణ వివరాలు ఆర్బీకేల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలి.
- ధాన్యం సేకరించిన 15 రోజుల్లో తప్పనిసరిగా పేమెంట్లు జరగాలి. రైతుల పట్ల అందరూ మానవతా దృక్పథంతో ఉండాలి. ధాన్యం సేకరణలో ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ తప్పనిసరి. ఎక్కడా మన రైతులకు నష్టం జరగకూడదు.

ఎఫ్‌ఏక్యూ రిలాక్స్‌ 
- వేరుశనగ రైతుల కష్టాలు తీర్చేందుకు కనీస నాణ్యతా ప్రమాణాలు (ఎఫ్‌ఏక్యూ) లేని పంటకు కూడా గ్రేడెడ్ ‌ఎమ్మెస్పీ రూ.4,500 ప్రకటించాం. ఆ మేరకు ఎఫ్‌ఏక్యూలో మినహాయింపులు ఇచ్చాం. దీన్ని అన్ని ఆర్బీకేల వద్ద బాగా ప్రచారం చేయాలి. 

రబీ సాగు.. సన్నద్ధత 
- రబీ సీజన్‌కు ఆర్బీకేలు, మండల, జిల్లా స్థాయిలలో అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అవసరం ఎంత అన్నది చూసి, వాటి లోటు లేకుండా చూడాలి. అన్నింటిలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కలెక్టర్లు, జేసీలు స్వయంగా మానిటర్‌ చేస్తే తప్ప సమస్యలు తెలియవు. వాటిని పరిష్కరించలేరు.
- వ్యవసాయ సలహా మండళ్లు కూడా ఉన్నాయి. అవి ప్రతి శుక్రవారం సమావేశమవుతున్నాయి. క్షేత్ర స్థాయిలో అవి నివేదికలు ఇస్తున్నాయి. వాటిని జేసీలు మండల వ్యవసాయ అధికారి ద్వారా చూడాలి. ఆ మేరకు అన్నీ స్వయంగా పర్యవేక్షించాలి. 
- సీఎం-యాప్, ఈ-క్రాప్‌ డేటా నమోదు, వినియోగం ఎలా సాగుతోందని చూడాలి. కాబట్టి జేసీలు, కలెక్టర్లు తప్పనిసరిగా సచివాలయాలు, ఆర్బీకేలు సందర్శించాలి. ఈ-క్రాప్‌ డేటా ఆధారంగా, గ్రామంలో ఉండాల్సినవి అన్నీ ఉన్నాయా? లేవా? అన్నవి చూడాలి.

గుర్రపు డెక్క తొలగించాలి
- ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో గుర్రపు డెక్కతో కాలువలు పూడుకు పోయాయి. వాటిని తొలిగించి నీరు సాఫీగా పారేలా చర్యలు చేపట్టాలి. పోలవరం కాఫర్ డ్యామ్ పనులు జరుగుతాయి కాబట్టి,  ఉభయ గోదావరి జిల్లాల్లో ఏప్రిల్‌ 1 తర్వాత నీటి సరఫరా ఆగిపోతుంది.
- అందువల్ల డిసెంబరు 31లోగా రబీకి సంబంధించి వరినాట్లు, ఇతర పనులు పూర్తయ్యేలా చూడాలి. ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ, ధ్యాస పెట్టాలి. అందుకోసం రైతులతో మాట్లాడాలి. ఆ రెండు జిల్లాలకు చెందిన మంత్రులు కూడా చొరవ చూపాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement