సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జ్ఞాపికను అందజేస్తున్న ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం నేతలు
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం నాయకులు గురువారం సీఎం వైఎస్ జగన్‌ను కలిశారు. తమ సమస్యలను వివరించి.. వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య సాయం కింద ప్రస్తుతమున్న రుణ సదుపాయం మొత్తాన్ని రూ.4 లక్షలకు పెంచాలని కోరారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో కొన్ని రకాల వ్యాధులకే రుణ సదుపాయం కల్పిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రకాల వ్యాధులకు రుణ సదుపాయాన్ని వర్తింపజేయాలన్నారు. ఉద్యోగుల పిల్లలకు స్థానికత క్లెయిమ్ చేసే గడువును మరో ఏడాది పెంచాలని కోరారు.
హైకోర్టు ఉద్యోగులకు రెయిన్ ట్రీ అపార్ట్‌మెంట్స్‌లో కలిపిస్తున్న ఉచిత వసతి, రవాణా సదుపాయాన్ని వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగించాలని అభ్యర్థించారు. పీఆర్సీ అమలుకు చర్యలు తీసుకోవాలని.. డీఏను వెంటనే చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. సీపీఎస్ స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని సంఘం అధ్యక్షుడు ఎ.వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు కె.సురేంద్రనాథ్, కార్యదర్శి ఎన్.సతీష్ వర్మ, సంయుక్త కార్యదర్శులు జి.కోటేశ్వరరావు, ఎన్.పీరు సాహెబ్, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు జి.చంద్రబాబు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment