
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వాహణపై సోమవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. టెన్త్ పరీక్షల నిర్వహణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలకు ఇంకా సమయం ఉందని పేర్కొంది. జూన్ 7నుంచి టెన్త్ పరీక్షల షెడ్యూల్ ఉందని, ఈ లోగా కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చింది. టెన్త్ పరీక్షల వాయిదా విషయంపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఏపీ సర్కార్ పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను హైకోర్టుజూన్ 2కు వాయిదా వేసింది.
కాగా ఇటీవల కరోనా వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణ విషయంలో పునరాలోచించాలని హైకోర్టు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆందోళనలను, మానసిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని పరీక్షల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంది. అధికారులతో మాట్లాడి ఏ విషయం తమకు చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్‌కు సూచించింది. ప్రభుత్వం తెలియచేసే వైఖరిని బట్టి తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచన చేయాల్సిందిగా హైకోర్టు చేసిన సూచనను పరిగణలోకి తీసుకుంటూ, న్యాయస్థానం అభిప్రాయాన్ని గౌరవిస్తూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
చదవండి: ఇంటర్ పరీక్షలు వాయిదా
Comments
Please login to add a commentAdd a comment