సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తాం | High Court order to AP Government about few cases | Sakshi
Sakshi News home page

సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తాం

Published Tue, Oct 13 2020 4:36 AM | Last Updated on Tue, Oct 13 2020 4:36 AM

High Court order to AP Government about few cases - Sakshi

సాక్షి, అమరావతి: పలు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లలో పోలీసులపై అక్రమ నిర్భంద ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో.. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీచేస్తామని హైకోర్టు ప్రాథమిక అభిప్రాయం వ్యక్తంచేసింది. ఈ కేసులను సీబీఐతో దర్యాప్తునకు ఎందుకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో రాజ్యాంగ అమలు వైఫల్యం (కాన్‌స్టిట్యూషనల్‌ బ్రేక్‌డౌన్‌) ఉందా లేదా అన్న అంశంపై వాదనలు వినిపించాలని పిటిషనర్లకు హైకోర్టు సూచించింది. తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. పోలీసులపై దాఖలైన పలు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లపై జస్టిస్‌ రాకేశ్‌ నేతృత్వంలోని ధర్మాసనం గత కొద్దిరోజులుగా విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై సోమవారం తన విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక సీనియర్‌ కౌన్సిల్‌ సర్వా సత్యనారాయణప్రసాద్‌ పోలీసుల తరఫున వాదనలు వినిపించారు. 

ఆ న్యాయవాది పట్ల దురుసుగా ప్రవర్తించలేదు 
దంపతుల అక్రమ నిర్భందంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాదిపట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించలేదని సత్యనారాయణప్రసాద్‌ అన్నారు. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కూడా ఒత్తిడి చేయలేదన్నారు. న్యాయవాది ఇంట్లో తనిఖీలకు ఈ కేసుకు సంబంధంలేదని ఆయన తెలిపారు. పిటిషనర్లవి కేవలం ఆరోపణలే తప్ప, వాస్తవాలు కావన్నారు. సివిల్‌ జడ్జి ఇచ్చిన నివేదికలో అనేక లోపాలున్నాయని, ఆ నివేదిక సమగ్రంగా లేదని సత్యనారాయణ ప్రసాద్‌ చెప్పారు.  

ఇలాంటి కేసుల్లో సీబీఐ దర్యాప్తా.. 
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. సివిల్‌ జడ్జి నివేదికలో ఉన్న వాస్తవాలని పిటిషనర్లు చెబుతున్నారని, అయితే.. ఆ నివేదికను పోలీసులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తామని తెలిపింది. ఎందుకు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించకూడదో వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. ఈ సమయంలో సత్యనారాయణ ప్రసాద్‌ జోక్యం చేసుకుంటూ.. ప్రతీ చిన్న కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరంలేదన్నారు. ఎలాంటి సందర్భాల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా నిర్దేశించిందని తెలిపారు. అసలు ఈ వ్యాజ్యాల్లో పోలీసు ఉన్నతాధికారులపై ఎలాంటి ఆరోపణలులేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకొచ్చారు. ఇలాంటి కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన దాఖలాలు లేవన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇదే రీతిలో గతంలో ఓ న్యాయవాది విషయంలో కూడా పోలీసులు వ్యవహరించారని, తరువాత ఆ న్యాయవాది తన కేసును ఉపసంహరించుకున్నారని తెలిపింది. ఆ కేసును ఇప్పటికే మూసేసినప్పటికీ, దానిపై మళ్లీ విచారణ జరుపుతామని స్పష్టంచేసింది. ఆ కేసును కూడా ప్రస్తుత కేసుల జాబితాలో ఉంచాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement