వైఎస్సార్సీపీ ఆఫీసులపై ‘ఓవరాక్షన్‌’కు బ్రేకులు | High Court order to AP Govt On YSRCP Party Offices Demolitions | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ కార్యాలయాల కూల్చివేతలపై యథాతథస్థితి..

Published Thu, Jun 27 2024 5:59 AM | Last Updated on Thu, Jun 27 2024 7:27 AM

High Court order to AP Govt On YSRCP Party Offices Demolitions

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దన్న ప్రభుత్వ వినతి తిరస్కృతి

పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశం

విచారణ నేటికి వాయిదా  

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల కూల్చివేతకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్రలకు హైకోర్టు బ్రేకులు వేసింది. వైఎస్సార్‌ సీపీ కార్యాలయాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్‌ కో)ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వైఎస్సార్‌సీపీ కార్యాలయాల భవనాల కూల్చివేతలపై పూర్తి వివ­రా­లను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమో­హన్‌ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. 

తాము చట్టానికి అనుగుణంగా వ్యవ­హరిస్తామని, కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్త­ర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అడ్వొకేట్‌ జనరల్‌ కార్యాలయ న్యాయవాదులు పదే పదే చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తాడేపల్లిలోని వైఎస్సార్‌­సీపీ ప్రధాన కార్యాలయం విషయంలో కూడా చట్టా­న్ని అనుసరిస్తామంటూ కోర్టుకు స్పష్టమైన హామీ ఇచ్చి తెల్లారేసరికి పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, చట్ట ప్రకారం నడుచుకుంటామన్న ప్రభుత్వ న్యాయవాదుల వాదనను విశ్వసించలేదు. యథాతథస్థితిని కొనసాగించాలన్న తన ఉత్తర్వులకే కట్టుబడింది.

నోటీసులపై అత్యవసరంగా పిటిషన్లు..
వివిధ జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాలను కూల్చివేసేందుకు అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. అధికారుల నోటీసులను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆయా జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వేర్వేరుగా హైకోర్టులో లంచ్‌మోషన్‌ రూపంలో అత్యవసరంగా 9 పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్‌ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారుల చర్యలు ఏకపక్షంగా ఉన్నాయన్నారు. 

2016లో నాటి టీడీపీ సర్కారు ఇచ్చిన జీవో ప్రకారమే వైఎస్సార్‌ సీపీ కార్యాలయ నిర్మాణం కోసం భూముల కేటాయింపు జరిగిందన్నారు. ఆ జీవో ప్రకారం భూమి స్వాధీనం చేసిన ఏడాది లోపు ఆ స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం తప్పనిసరన్నారు. లేనిపక్షంలో కేటాయించిన భూమిని తిరిగి వెనక్కి తీసుకోవచ్చన్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నామని, అయితే అధికారులు నిర్ణీత వ్యవధిలోపు అనుమతులు ఇవ్వలేదన్నారు. దీంతో ఇలా నిర్ణీత వ్యవధిలోపు అనుమతులు ఇవ్వకుంటే, అనుమతులు ఇచ్చినట్లే భావించి పార్టీ కార్యాలయాల నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. 



క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నాం..
అనుమతులు తీసుకోలేదన్న కారణంతో పార్టీ కార్యాలయాలను ఎందుకు కూల్చివేయరాదో వివరణ ఇవ్వాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారని వీరారెడ్డి తెలిపారు. దానికి తాము సవివరంగా వివరణ ఇచ్చినా మరో అధికారి నోటీసులు ఇచ్చారన్నారు. దీన్నిబట్టి కూల్చివేతకు అధికారులు ఎంత తొందరపడుతున్నారో అర్థమవుతోందన్నారు. ఒకవేళ తమ నిర్మాణాలు అక్రమమే అనుకున్నప్పటికీ, వాటిని క్రమబద్ధీకరించే అధికారం చట్ట ప్రకారం మునిసిపల్‌ కమిషనర్‌కు ఉందని నివేదించారు. 

ఇవన్నీ చేయకుండా, ప్రక్రియను అనుసరించకుండా నేరుగా కూల్చివే­తలకు పాల్పడరాదన్నారు. తాము క్రమబద్ధీక­రణకు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కూల్చివేతలు సమస్యకు పరిష్కారం కాదని, అది కేవలం చివరి అంకం మాత్రమేనన్నారు. ఈ మధ్యలో చట్టం పలు ప్రత్యామ్నాయాలను చూపిందని నివేదించారు. తుది ఉత్తర్వులు జారీ చేసే ముందు కమిషనర్‌ మెదడు ఉపయోగించాల్సి ఉంటుందని, యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదన్నారు. తాము ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకోకుండా కూల్చివేతల విషయంలో ముందుకెళ్లడానికి వీల్లేదన్నారు.

చట్ట ప్రకారం నడుచుకుంటాం.. ఇచ్చింది షోకాజ్‌ నోటీసులే
వాదనలు విన్న అనంతరం అధికారులు ఇతర ప్రొసీడింగ్స్‌ను కొనసాగించుకోవచ్చని, అయితే కూల్చివేతల విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే కేవలం ఆందోళనతోనే ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారని, వీటికి విచారణార్హతే లేదని అడ్వొకేట్‌ జనరల్‌ కార్యాలయం తరపున హాజరైన న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి పేర్కొన్నారు.కూల్చివేస్తామనేందుకు ఎలాంటి ఆధారాలను చూపలేదన్నారు. కూల్చివేతల విషయంలో తాము చట్ట ప్రకారం నడుచుకుంటామన్నారు. కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు. 

తాము ఇచ్చింది కేవలం షోకాజ్‌ నోటీసులు మాత్రమేనన్నారు. ఈ సమయంలో వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇలాగే చట్ట ప్రకారం నడుచుకుంటామంటూ వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యాలయ భవనాన్ని తెల్లవారేసరికి కూల్చే­శారని కోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్సార్‌సీపీ తరఫు మరో న్యాయవాది వీఆర్‌ రెడ్డి కొవ్వూరి జోక్యం చేసుకుంటూ, కూల్చివేతల విషయంలో ఏమీ చేయబోమంటూ కృష్ణారెడ్డి చెప్పిన విషయాన్ని కోర్టుకి ఇచ్చిన హామీగా నమోదు చేయాలన్నారు. దీన్ని కృష్ణారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తాను ఎలాంటి హామీ ఇవ్వడం లేదన్నారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ యథాతథస్థితి ఉత్తర్వులు ఇస్తానని పునరుద్ఘాటించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement