సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారానికి సంబంధించిన వివాదాలన్నింటిపై ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అలాంటప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు వ్యవహారాన్ని అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఎలా పంపగలమని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో స్పష్టతనివ్వాలని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు.
అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి కొనుగోలు చేసిన తమ ఆస్తులను జప్తుచేస్తూ ఈడీ జారీచేసిన తాత్కాలిక జప్తు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బ్యాంకులు నిర్వహించిన వేలంలో తాము కొన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా ఈడీ జప్తుచేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
అంతేగాక అసలు అగ్రిగోల్డ్ కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ కంపెనీ నుంచి తాము కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్‌మెంట్లను సైతం జప్తుచేస్తూ సీఐడీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయా ప్లాట్ల యజమానులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రుణం ఇచ్చాం కాబట్టి.. ఆస్తులను వేలం వేసే హక్కు తమకుందంటూ బ్యాంకులు కొన్ని పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కొద్ది రోజులుగా విచారిస్తున్నారు.
జప్తుచేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే మొదటి హక్కు ఉందని రాష్ట్ర ప్రభుత్వం గత వారం హైకోర్టులో వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం కూడా న్యాయమూర్తి ఈ వ్యాజ్యాలపై మరోసారి విచారించారు. ఈ సందర్భంగా ఈడీ న్యాయవాది భాస్కరరావు వాదనలు వినిపిస్తూ.. తాము సుమారు రూ.2 వేలకోట్ల విలువైన ఆస్తులను జప్తుచేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీచేశామన్నారు. తమ జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే చట్ట ప్రకారం అడ్జ్యుడికేటింగ్ అథారిటీని ఆశ్రయించాలే తప్ప హైకోర్టును కాదన్నారు.
ఏపీ సీఐడీ జారీచేసిన జప్తు ఉత్తర్వుల కంటే ఈడీ జారీచేసిన జప్తు ఉత్తర్వులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ..అగ్రిగోల్డ్ ఆస్తులతో పాటు అన్ని వివాదాలపై ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు ధర్మాసనం గతంలోనే ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు ధర్మాసనం ఆదేశాలకు విరుద్ధంగా అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి వెళ్లాలని తామెలా ఆదేశాలివ్వగలమని ప్రశ్నించారు. ఈ విషయంలో స్పష్టతనివ్వాలని భాస్కరరావును ఆదేశించారు. విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment