confiscation assets
-
ఒకే రోజు రూ.35 కోట్లు జప్తు
సాక్షి, హైదరాబాద్, సికింద్రాబాద్, నిజాంపేట్, రఘునాథపల్లి: రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో బుధవారం ఒకే రోజు రికార్డు స్థాయిలో మొత్తం రూ.35.52 కోట్ల విలువ చేసే నగదు, మద్యం, ఇతర వస్తువులను జప్తు చేశారు. దీంతో బుధవారం నాటికి రాష్ట్రంలో జప్తు చేసిన నగదు, ఇతర వస్తువుల మొత్తం విలువ రూ.165.81 కోట్లకు పెరిగిపోయింది. బుధవారం రూ.6.25 కోట్ల నగదును జప్తు చేయగా, మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు రూ.77.87 కోట్లకు పెరిగింది. 7వ తేదీ నుంచి నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.8.99 కోట్లు విలువ చేసే 59,091 లీటర్ల మద్యం, 18,088 కిలోల నల్లబెల్లం జప్తు చేశారు. రూ.3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత బుధవారం రూ.3 కోట్లు విలువ చేసే 1,086 కేజీల గంజాయిని పట్టుకోగా, ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం గంజాయి విలువ రూ.7.55 కోట్లకు పెరిగింది. కాగా ఇప్పటి వరకు జప్తు చేసిన మొత్తం బంగారం, ఇతర ఖరీదైన లోహాల విలువ రూ.62.73 కోట్లకు చేరింది. బుధవారం రూ.2.3 కోట్లు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, కుక్కర్లు, వాహనాలను జప్తు చేయగా, ఇప్పటివరకు జప్తు చేసిన ఇలాంటి వస్తువుల మొత్తం విలువ రూ.8.64 కోట్లకు చేరింది. దీంతో జప్తు చేసిన మొత్తం నగదు, ఇతర వస్తువుల విలువ రూ.165.81 కోట్లకు చేరినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, 2018లో జరిగిన రాష్ట్ర శాసనసభ సాధాణ ఎన్నికల్లో మొత్తం రూ.97 కోట్ల నగదు, రూ.34 కోట్లు విలువ చేసే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు వికాస్‌రాజ్ తెలిపారు. గిఫ్ట్ ఆర్టికల్స్, బెడ్‌షీట్స్ స్వాధీనం హైదరాబాద్ దక్కన్, దానాపూర్–సికింద్రాబాద్ రైళ్లలో పార్శిల్ సర్వీసు ద్వారా సికింద్రాబాద్‌కు చేరుకున్న 30 భారీ కాటన్ పార్శిళ్ల స్టెయిన్లెస్ స్టీల్ గిఫ్ట్ ఆర్టికల్స్, బెడ్షీట్లను రైల్వేపోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. 26 కాటన్ పార్శిళ్లల్లో రూ.1.29 కోట్ల విలువ చేసే 2,160 కిలోల స్టెయిన్ లెస్ స్టీల్ ఆర్టికల్స్, మరో నాలుగు కాటన్ పార్శిళ్లల్లో రూ.78 వేల విలుచేసే దుప్పట్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మరో కేసులో సికింద్రాబాద్ జనరల్ బజార్‌కు చెందిన కిషోర్‌సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి 538 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. రూ. 2.25 కోట్ల విలువైన చీరల పట్టివేతబాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి ప్రగతినగర్‌లోనిపంచవటి అపార్ట్మెంట్ ఆవరణలో ఉన్నఏపీ 16టీవీ 3280 నంబరు గల లారీలో సరుకును పరిశీలించగా భారీ మొత్తంలో చీరలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.2,25,98,500 ఉంటుందని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి పంచవటి అపార్ట్మెంట్లో ఓ రాజకీయపార్టీ సమావేశం జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. రూ.1.37 కోట్ల బ్యాంక్ డబ్బు సీజ్ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కోమళ్ల టోల్ ప్లాజా వద్ద క్యూ ఆర్ కోడ్ సరిగా లేని బ్యాంకు నగదు రూ.1,37,50,000ను పోలీసులు సీజ్ చేశారు. -
ధర్మాసనం ఆదేశాలుండగా.. అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఎలా?
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారానికి సంబంధించిన వివాదాలన్నింటిపై ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలిచ్చిందని, అలాంటప్పుడు అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తు వ్యవహారాన్ని అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి ఎలా పంపగలమని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంలో స్పష్టతనివ్వాలని ఈడీ తరఫు న్యాయవాది జోస్యుల భాస్కరరావును ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి కొనుగోలు చేసిన తమ ఆస్తులను జప్తుచేస్తూ ఈడీ జారీచేసిన తాత్కాలిక జప్తు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బ్యాంకులు నిర్వహించిన వేలంలో తాము కొన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా ఈడీ జప్తుచేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అంతేగాక అసలు అగ్రిగోల్డ్ కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ కంపెనీ నుంచి తాము కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్మెంట్లను సైతం జప్తుచేస్తూ సీఐడీ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆయా ప్లాట్ల యజమానులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రుణం ఇచ్చాం కాబట్టి.. ఆస్తులను వేలం వేసే హక్కు తమకుందంటూ బ్యాంకులు కొన్ని పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కొద్ది రోజులుగా విచారిస్తున్నారు. జప్తుచేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే మొదటి హక్కు ఉందని రాష్ట్ర ప్రభుత్వం గత వారం హైకోర్టులో వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా శుక్రవారం కూడా న్యాయమూర్తి ఈ వ్యాజ్యాలపై మరోసారి విచారించారు. ఈ సందర్భంగా ఈడీ న్యాయవాది భాస్కరరావు వాదనలు వినిపిస్తూ.. తాము సుమారు రూ.2 వేలకోట్ల విలువైన ఆస్తులను జప్తుచేస్తూ ప్రాథమిక జప్తు ఉత్తర్వులు జారీచేశామన్నారు. తమ జప్తు ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే చట్ట ప్రకారం అడ్జ్యుడికేటింగ్ అథారిటీని ఆశ్రయించాలే తప్ప హైకోర్టును కాదన్నారు. ఏపీ సీఐడీ జారీచేసిన జప్తు ఉత్తర్వుల కంటే ఈడీ జారీచేసిన జప్తు ఉత్తర్వులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ..అగ్రిగోల్డ్ ఆస్తులతో పాటు అన్ని వివాదాలపై ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు ధర్మాసనం గతంలోనే ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేశారు. అలాంటప్పుడు ధర్మాసనం ఆదేశాలకు విరుద్ధంగా అడ్జ్యుడికేటింగ్ అథారిటీకి వెళ్లాలని తామెలా ఆదేశాలివ్వగలమని ప్రశ్నించారు. ఈ విషయంలో స్పష్టతనివ్వాలని భాస్కరరావును ఆదేశించారు. విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేశారు. -
జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై మొదటి హక్కు రాష్ట్రానికే
సాక్షి, అమరావతి : జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే మొదటి హక్కు అని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. డిపాజిటర్ల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకే ఆస్తులపై రెండు దర్యాప్తు సంస్థల జప్తు ఉత్తర్వుల వల్ల డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చాలన్న ప్రభుత్వ ప్రయత్నాల్లో తీవ్ర జాప్యం జరిగి బాధితులు నష్టపోతారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులను తిరిగి మనీలాండరింగ్ చట్టం కింద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడం ఎంత వరకు సమంజసమో తేల్చాలని కోర్టును అభ్యర్థించారు.మనీలాండరింగ్, దివాలా చట్టాల కింద చేసిన జప్తులకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన జప్తునకు మధ్య వైరుద్ధ్యం లేదని తెలిపారు.డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అగ్రిగోల్డ్ ఎగవేసిన మొత్తాలను తిరిగి చెల్లిస్తోందని నివేదించారు. రూ.20 వేలు, అంతకన్నా తక్కువ డిపాజిట్లు చేసిన వారికి ఇప్పటికే రూ.900 కోట్ల మేర తిరిగి చెల్లించినట్లు చెప్పారు. మనీలాండరింగ్, దివాలా చట్టాలు డిపాజిటర్ల పరిరక్షణకు ఉద్దేశించినవి కావని చెప్పారు. డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈడీ గానీ, బ్యాంకులు గానీ నీరుగార్చలేవని అన్నారు. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణంలో నిందితులు వారిని వారు రక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఇతర ఏ దర్యాప్తు సంస్థా నిరోధించలేదని తేల్చి చెప్పారు. ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర ఉందని చెప్పారు.అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి కొన్న తమ ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు, కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ నుంచి కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్మెంట్లను సైతం సీఐడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ప్లాట్ల యజమానులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నారు. గురువారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు. -
విశాఖ టీడీపీకి జీవీఎంసీ షాక్..!
సాక్షి, విశాఖపట్నం: విశాఖలోని టీడీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు జప్తు నోటీసులు సిద్ధం చేశారు. నగరంలోని సెవెన్ హిల్స్ సమీపంలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయం 2020-21 సంవత్సరానికి 27 లక్షల రూపాయలు ఆస్తి పన్ను చెల్లించాల్సి ఉంది. కానీ కేవలం పది లక్షలు మాత్రమే టీడీపీ కార్యాలయం నిర్వాహకులు చెల్లించగా, 17 లక్షలు బకాయి పడ్డారు. (చదవండి: టీడీపీలో రాజీనామాల పర్వం..) మిగిలిన చెల్లింపులు కోసం అధికారులు నోటీసులు పంపించిన కానీ టీడీపీ కార్యాలయం నుంచి సరైన స్పందన లేకపోవడంతో 17 లక్షల ఆస్తి పన్ను బకాయిలకు గాను జీవీఎంసీ అధికారులు జప్తు నోటీసును సిద్ధం చేశారు. ఈ విషయం తెలిసిన తెలుగు తమ్ముళ్లు.. గతంలో ఎక్కువ మొత్తం ఆస్తిపన్ను నిర్ణయించడంతో సవరించాలని కోరామని.. అందుకే చెల్లింపులో జాప్యం జరిగిందని చెబుతున్నారు.(చదవండి: టీడీపీకి అభ్యర్థులు కరువు.. బాబు హైరానా..) -
పీఎన్బీ కేసులో రూ.218 కోట్లు జప్తు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మేర మోసం చేసిన కేసులో వజ్రాల వ్యాపారీ మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ సన్నిహితుడు మిహిర్ భన్సాలీలకు సంబంధించి రూ.218 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జప్తు చేసింది. జప్తు చేసిన వాటిలో భన్సాలీ విదేశాల్లో కొన్న రూ.51 కోట్ల ఫ్లాట్, చోక్సీ రూ.27 కోట్లతో మరో దేశంలో కొన్న విల్లా, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పేరుతో 2.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని భవంతి, ముంబైలోని ట్రంప్ టవర్‌లో రూ.1.7 కోట్లతో కొన్న ఫ్లాట్, నీరవ్‌కి చెందిన రూ.18.76 కోట్ల విలువైన వజ్రాలు ఉన్నాయి. తాజా జప్తుతో ఇప్పటివరకూ ఈడీ రూ.4,488 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు అయింది. -
త్వరలో ఎర్ర స్మగ్లర్ల ఆస్తుల జప్తు
ఎర్ర చందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్మగ్లర్లను అరెస్టు చేయడం, వారిని జైలుకు పంపడంతో పాటు వారి అక్రమ ఆస్తులను జప్తు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం అటవీ శాఖ అధికారులకు కొన్ని ప్రత్యేక అధికారాలను కల్పించనుంది. 2016లో వచ్చిన అటవీ శాఖ అమెండమెంట్ యాక్టు ప్రకారం ఎర్ర చందనం స్మగ్లర్లు కూడబెట్టిన అక్రమ ఆస్తులను జప్తు చేసేందుకు సమాయత్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి : శేషాచలంలో ఉన్న అపారమైన వృక్ష సంపదలో ఎర్రచందనం ఒకటి. ఇప్పటికి 20 ఏళ్లుగా ఎర్ర చంద నం చెట్లను నరికి స్మగ్లర్లు సొ మ్ము చేసుకుంటున్నారు. చిత్తూ రు, కడప, కర్నూలు, ప్రకాశం జి ల్లాల్లో 70 లక్షల ఎర్ర చందనం చెట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. వీటి విలువ కోట్లలోనే. ఇదిలా ఉండగా నిత్యం శేషాచలంలోకి చొరబడుతున్న ఎర్ర స్మగ్లర్లను నిలువరించడం రాష్ట్ర ప్రభుత్వానికి తలకుమించిన భారంగా మారింది. ఎర్రచందనం పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్, అటవీ, పోలీస్ శాఖలు విస్తృతంగా అడవుల్లో కూంబింగ్ జరిపి రోజూ స్మగ్లర్లను అరెస్టు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అక్రమ రవాణా ఆగడం లేదు. స్మగ్లర్ల తీరులో ఎలాంటి మార్పు రాలేదు. స్మగ్లింగ్ ఆగనూ లేదు. ఈ క్రమంలో స్మగ్లర్లపై మరింత ఉక్కుపాదం మోపేందుకు సర్కారు ఆస్తుల జప్తును తెరమీదకు తెస్తోంది. ఇప్పటివరకూ ఎంతమంది స్మగ్లర్లు అరెస్టయ్యారు. వారికున్న ఆస్తుల విలువ ఎంత, ఎక్కడెక్కడ ఆస్తులున్నాయో గుర్తించేందుకు సిద్ధమైంది. అటవీ, పోలీస్ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచి వివిధ జిల్లాల్లో ఉన్న స్మగ్లర్ల వివరాలను సేకరిస్తోంది. ఎర్రచందనం కేసుల్లో అరెస్టయిన వారి ఆస్తుల విలువను అంచనా వేసేందుకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయనుంది. ఆస్తుల జప్తునకు సంబం ధించిన కేసుల విచారణాధికారులుగా డీఎస్పీలను నియమించనున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలో ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేయనుంది. తొలి జాబితాలో వంద మందికి పైనే... ఆస్తుల జప్తునకు ఉపక్రమించే ముందు ప్రభుత్వం ఎర్రచందనం స్మగ్లర్ల జాబితాను సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ జిల్లాల్లో చార్జిషీట్ ఫైల్ అయిన స్మగ్లర్ల వివరాలను సేకరించి ప్రభుత్వం తొలి జాబితా విడుదల చేయనుంది. సుమారు వంద మందికి పైగా వీరుంటారని సమాచారం. కేవలం అక్రమ ఆస్తులను మాత్రమే జప్తు చేసే వీలుందని అధికారులు అంటున్నారు. ఈ విషయం తెలిసి స్మగ్లర్ల గుండెల్లో రైళ్లు పరుగె డుతున్నాయి. -
జయలలిత ఆస్తుల జప్తు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన ఆస్తుల జప్తుకు ఆ రాష్ట్ర సర్కారు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువారూరు, తూత్తుకూడి, తంజావూరు జిల్లాల్లోని వీరి ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక అవినీతి నిరోధక, నిఘా విభాగ డైరెక్టర్ మంజునాథ ఇటీవల తమిళనాడు ప్రభుత్వానికి, ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం 6 జిల్లాల కలెక్టర్లకు ఆస్తుల జప్తుకు ఆదేశాలిచ్చారు. 68 ఆస్తులను జప్తు చేయాలని కలెక్టర్లకు సూచించింది. ఈ ఆస్తులకు తమిళనాడు ప్రభుత్వమే పూర్తి హక్కుదారుగా ఉంటుంది. అవసరమైతే శాఖాపరమైన అవసరాలకు వాడుకోవచ్చు లేదా బహిరంగవేలం వేయొచ్చు. అయితే నలుగురు దోషులకు కోర్టు విధించిన జరిమానాకు, ఈ ఆస్తుల జప్తునకు సం బంధం లేదని, అక్రమాస్తులుగా పరిగణించి వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు చెప్పారు. జయS నివసించిన చెన్నైలోని పోయెస్‌గార్డెన్ ఇల్లు, కొడనాడు ఎస్టేట్ జప్తు ఆస్తుల జాబితాలో లేకపోవడం గమనార్హం. 1991–96 మధ్య జయ సీఎంగా ఆస్తులను కూడబెట్టినట్లు అప్పటి జనతాపార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు వేశారు. జయ, ఆమె మాజీ దత్తపుత్రుడు సుధాకరన్, శశికళ, శశికళ బంధువు ఇళవరసిలను ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చడం తెలిసిందే. ప్రస్తుతం శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు. -
మాల్యా రూ.1,620 కోట్ల ఆస్తులు జప్తు
ముంబై: ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) తాజాగా మాల్యాకు చెందిన రూ.1,620 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. స్పెషల్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) కోర్టు ఆదేశాల మేరకు ప్రొవిజన్‌స ఆఫ్ క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్పీసీ) చట్టం ప్రకారం ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ పేర్కొంది. గతంలోని రూ.8,041 కోట్ల విలువైన ఆస్తుల జప్తుతో పోలిస్తే ప్రస్తుత తాజా జప్తు విలువ అధికంగా ఉంది. అరుుతే మాల్యా విదేశీ ఆస్తుల జప్తుకు ఈడీ చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. -
మాల్యాను బహిష్కరించలేం!
విజయ్‌మాల్యాను భారత్ తిరిగి పంపడంపై బ్రిటన్ స్పష్టీకరణ ♦ ‘అప్పగింత’ కోరితే సహకరిస్తామని హామీ ♦ ఇక ఈ దిశలో న్యాయ ప్రక్రియ ♦ ప్రారంభంలో కేంద్రం: జైట్లీ వెల్లడి న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రుణ ఎగవేత కేసులను ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే ఆయనపై ఉన్న కేసులు, తీవ్ర అభియోగాలకు సంబంధించి ఆయన ‘అప్పగింత’కు భారత్ కోరవచ్చని బ్రిటన్ ప్రభుత్వం సూచించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాశ్ స్వరూప్ తెలిపారు. ఆయన బహిష్కారం మినహా, ‘అప్పగింత’ తత్సంబంధ న్యాయ అంశాలకు సంబంధించి భారత్‌తో పూర్తిగా సహకరిస్తామని కూడా బ్రిటన్ ప్రభుత్వం తెలిపిందని ఆయన వెల్లడించారు. మాల్యాను దేశం నుంచి బహిష్కరించాలని బ్రిటన్‌కు భారత్ పదిహేను రోజుల క్రితం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అక్రమ ధనార్జన 2002 చట్టం కింద పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌మాల్యాను విచారించడం లక్ష్యంగా భారత్ ఇప్పటికే ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. ఆయనపై నాన్-బెయిలబుల్ వారంట్ కూడా జారీ అయ్యింది. ‘‘1971 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి పాస్‌పోర్ట్ న్యాయపరంగా చలామణిలో ఉన్నంతకాలం సంబంధిత వ్యక్తిని దేశం నుంచి వెళ్లిపోవాలని మేము ఆదేశించలేము’’ అని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసిందని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు. ‘అప్పగింత’కు ప్రక్రియను ప్రారంభిస్తాం: జైట్లీ బ్రిటన్ నిర్ణయం నేపథ్యంలో- విజయ్‌మాల్యాపై ఉన్న ఆరోపణలకు సంబంధించి చార్జ్‌షీట్ దాఖలయిన తర్వాత బ్రిటన్ను ఆయనను ‘అప్పగించాలని’ కోరడానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ఈ విషయాన్ని తెలిపారు. చలామణిలో ఉన్న పాస్‌పోర్ట్‌తో ఒక వ్యక్తి బ్రిటన్‌లోకి ప్రవేశించడం లేదా నివసించినంతకాలం అటువంటి వ్యక్తిని తమ చట్ట నిబంధనల ప్రకారం బహిష్కరించలేమని బ్రిటన్ పేర్కొన్నట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు. రుణాలు రాబట్టుకోడానికి బ్యాంకులు తగిన ప్రయత్నం అంతా చేస్తాయని, విచారణా సంస్థలు తమ దర్యాప్తును వేగవంతం చేస్తాయని జైట్లీ స్పష్టం చేశారు. దాదాపు రూ.900 కోట్ల ఐడీబీఐ రుణ ఎగవేత కేసులో భారత్ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ విజ్ఞప్తి మేరకు భారత విదేశాంగశాఖ ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. వెన్వెంటనే ముంబై ప్రత్యేక కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రూ.9,200 కోట్ల బ్యాంకింగ్ కన్సార్షియం రుణ ఎగవేత కేసులో సుప్రీం ఆదేశాల మేరకు తన, తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సీల్డ్కవర్లో తెలియజేసిన మాల్యా, దేశానికి వచ్చే విషయంలో మాత్రం ఎటువంటి సూచనా చేయలేదు. తాను దేశానికి వచ్చిన మరుక్షణం తీహార్ జైలుకు పంపిస్తారన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. సుప్రీం ఆదేశాల ప్రకారం 2 నెలల్లో ఆయనపై బ్యాంకింగ్ రికవరీ కేసులను బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంది. ఆస్తుల జప్తునకు ఈడీ కసరత్తు విజయ్‌మాల్యాపై కేసుల దర్యాప్తులో భాగంగా దేశంలో ఆయనకు సంబంధించిన దాదాపు రూ.9,000 కోట్ల విలువైన ఆస్తులు, షేర్లను జప్తు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) యోచిస్తోంది. ఈ మేరకు తగిన చర్యలకు ఈడీ ఇప్పటికే శ్రీకారం చుట్టినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. వివిధ కంపెనీల్లో షేర్ల జప్తు విషయంపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీని కూడా సంప్రదించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బంగ్లాలు, విలువైన వాహనాలు, బ్యాంక్ బ్యాలెన్స్సహా ఆయనకు సంబంధించి స్థిర, చర ఆస్తుల వివరాలను అన్నింటినీ ఈడీ మదింపు చేసినట్లు సమాచారం. చార్జ్‌షీటు దాఖలుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున, తొలుత ఆస్తుల జప్తుపై ముందడుగు వేయాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు జెట్ వేలం వాయిదా: ఇదిలాఉండగా, ముంబై విమానాశ్రయంలో ల్యాండ్‌చేసిన విజయ్‌మాల్యా వ్యక్తిగత జెట్ వేలాన్ని సేవల పన్ను శాఖ జూన్ 29-30 తేదీలకు వాయిదా వేసింది. మే 12-13 తేదీల్లో ఈ వేలం జరగాల్సి ఉంది. మాల్యా నిర్వహించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి రూ.535 కోట్ల సేవల పన్ను బకాయిలు రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆ శాఖ ఈ జెట్ వేలం నిర్ణయం తీసుకుంది. అయితే కేవలం ఒకేఒక్క బిడ్డర్ ముందుకు రావడంతో వేలం ప్రక్రియ వాయిదా పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒక్క బిడ్డర్ సైతం నిర్ణీత గడువులోపల రూ. కోటి డిపాజిట్ చేయలేదని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి.