సాక్షి, అమరావతి : జప్తు చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికే మొదటి హక్కు అని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్. శ్రీరామ్ హైకోర్టుకు నివేదించారు. డిపాజిటర్ల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒకే ఆస్తులపై రెండు దర్యాప్తు సంస్థల జప్తు ఉత్తర్వుల వల్ల డిపాజిటర్ల ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. ఆస్తులను విక్రయించి డిపాజిటర్లకు ప్రయోజనం చేకూర్చాలన్న ప్రభుత్వ ప్రయత్నాల్లో తీవ్ర జాప్యం జరిగి బాధితులు నష్టపోతారని వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులను తిరిగి మనీలాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేయడం ఎంత వరకు సమంజసమో తేల్చాలని కోర్టును అభ్యర్థించారు.మనీలాండరింగ్, దివాలా చట్టాల కింద చేసిన జప్తులకు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన జప్తునకు మధ్య వైరుద్ధ్యం లేదని తెలిపారు.డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అగ్రిగోల్డ్ ఎగవేసిన మొత్తాలను తిరిగి చెల్లిస్తోందని నివేదించారు. రూ.20 వేలు, అంతకన్నా తక్కువ డిపాజిట్లు చేసిన వారికి ఇప్పటికే రూ.900 కోట్ల మేర తిరిగి చెల్లించినట్లు చెప్పారు. మనీలాండరింగ్, దివాలా చట్టాలు డిపాజిటర్ల పరిరక్షణకు ఉద్దేశించినవి కావని చెప్పారు.
డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను ఈడీ గానీ, బ్యాంకులు గానీ నీరుగార్చలేవని అన్నారు. అగ్రిగోల్డ్ డిపాజిట్ల కుంభకోణంలో నిందితులు వారిని వారు రక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.ఇలాంటి పరిస్థితుల్లో జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు తిరిగి చెల్లించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాన్ని ఇతర ఏ దర్యాప్తు సంస్థా నిరోధించలేదని తేల్చి చెప్పారు. ఏపీ డిపాజిటర్ల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర ఉందని చెప్పారు.అగ్రిగోల్డ్ యాజమాన్యం నుంచి కొన్న తమ ఆస్తులను ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ఆల్ ఇండియా అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
అలాగే బ్యాంకులు నిర్వహించిన వేలంలో కొన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కూడా ఈడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ మరికొన్ని కంపెనీలు, వ్యక్తులు, కుంభకోణానికి ముందే అగ్రిగోల్డ్ నుంచి కొన్న భూముల్లో నిర్మించుకున్న అపార్ట్‌మెంట్లను సైతం సీఐడీ జప్తు చేయడాన్ని సవాలు చేస్తూ ప్లాట్ల యజమానులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి కొద్ది రోజులుగా విచారణ జరుపుతున్నారు. గురువారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విచారణను ఈ నెల 31కి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment