జయలలిత ఆస్తుల జప్తు
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దివంగత తమిళనాడు మాజీ సీఎం జయలలిత, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు చెందిన ఆస్తుల జప్తుకు ఆ రాష్ట్ర సర్కారు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, తిరువారూరు, తూత్తుకూడి, తంజావూరు జిల్లాల్లోని వీరి ఆస్తులను జప్తు చేయాలని కర్ణాటక అవినీతి నిరోధక, నిఘా విభాగ డైరెక్టర్ మంజునాథ ఇటీవల తమిళనాడు ప్రభుత్వానికి, ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం 6 జిల్లాల కలెక్టర్లకు ఆస్తుల జప్తుకు ఆదేశాలిచ్చారు.
68 ఆస్తులను జప్తు చేయాలని కలెక్టర్లకు సూచించింది. ఈ ఆస్తులకు తమిళనాడు ప్రభుత్వమే పూర్తి హక్కుదారుగా ఉంటుంది. అవసరమైతే శాఖాపరమైన అవసరాలకు వాడుకోవచ్చు లేదా బహిరంగవేలం వేయొచ్చు. అయితే నలుగురు దోషులకు కోర్టు విధించిన జరిమానాకు, ఈ ఆస్తుల జప్తునకు సం బంధం లేదని, అక్రమాస్తులుగా పరిగణించి వాటిని స్వాధీనం చేసుకుంటున్నామని అధికారులు చెప్పారు.
జయS నివసించిన చెన్నైలోని పోయెస్‌గార్డెన్ ఇల్లు, కొడనాడు ఎస్టేట్ జప్తు ఆస్తుల జాబితాలో లేకపోవడం గమనార్హం. 1991–96 మధ్య జయ సీఎంగా ఆస్తులను కూడబెట్టినట్లు అప్పటి జనతాపార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి కేసు వేశారు. జయ, ఆమె మాజీ దత్తపుత్రుడు సుధాకరన్, శశికళ, శశికళ బంధువు ఇళవరసిలను ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చడం తెలిసిందే. ప్రస్తుతం శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు జైలు శిక్ష అనుభవిస్తున్నారు.