మాల్యాను బహిష్కరించలేం!
విజయ్‌మాల్యాను భారత్ తిరిగి పంపడంపై బ్రిటన్ స్పష్టీకరణ
♦ ‘అప్పగింత’ కోరితే సహకరిస్తామని హామీ
♦ ఇక ఈ దిశలో న్యాయ ప్రక్రియ
♦ ప్రారంభంలో కేంద్రం: జైట్లీ వెల్లడి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రుణ ఎగవేత కేసులను ఎదుర్కొంటున్న పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యాను బ్రిటన్ నుంచి భారత్‌కు రప్పించాలన్న కేంద్రం ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. తమ చట్ట నిబంధనల ప్రకారం- మాల్యాను దేశం నుంచి బహిష్కరించడం సాధ్యంకాదని ఆ దేశం స్పష్టం చేసింది. అయితే ఆయనపై ఉన్న కేసులు, తీవ్ర అభియోగాలకు సంబంధించి ఆయన ‘అప్పగింత’కు భారత్ కోరవచ్చని బ్రిటన్ ప్రభుత్వం సూచించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి వికాశ్ స్వరూప్ తెలిపారు.
ఆయన బహిష్కారం మినహా, ‘అప్పగింత’ తత్సంబంధ న్యాయ అంశాలకు సంబంధించి భారత్‌తో పూర్తిగా సహకరిస్తామని కూడా బ్రిటన్ ప్రభుత్వం తెలిపిందని ఆయన వెల్లడించారు. మాల్యాను దేశం నుంచి బహిష్కరించాలని బ్రిటన్‌కు భారత్ పదిహేను రోజుల క్రితం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అక్రమ ధనార్జన 2002 చట్టం కింద పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్‌మాల్యాను విచారించడం లక్ష్యంగా భారత్ ఇప్పటికే ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది.
ఆయనపై నాన్-బెయిలబుల్ వారంట్ కూడా జారీ అయ్యింది. ‘‘1971 ఇమిగ్రేషన్ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి పాస్‌పోర్ట్ న్యాయపరంగా చలామణిలో ఉన్నంతకాలం సంబంధిత వ్యక్తిని దేశం నుంచి వెళ్లిపోవాలని మేము ఆదేశించలేము’’ అని బ్రిటన్ ప్రభుత్వం స్పష్టం చేసిందని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.
‘అప్పగింత’కు ప్రక్రియను ప్రారంభిస్తాం: జైట్లీ
బ్రిటన్ నిర్ణయం నేపథ్యంలో- విజయ్‌మాల్యాపై ఉన్న ఆరోపణలకు సంబంధించి చార్జ్‌షీట్ దాఖలయిన తర్వాత బ్రిటన్‌ను ఆయనను ‘అప్పగించాలని’ కోరడానికి సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని భారత్ భావిస్తోంది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ఈ విషయాన్ని తెలిపారు. చలామణిలో ఉన్న పాస్‌పోర్ట్‌తో ఒక వ్యక్తి బ్రిటన్‌లోకి ప్రవేశించడం లేదా నివసించినంతకాలం అటువంటి వ్యక్తిని తమ చట్ట నిబంధనల ప్రకారం బహిష్కరించలేమని బ్రిటన్ పేర్కొన్నట్లు తన వద్ద సమాచారం ఉందన్నారు. రుణాలు రాబట్టుకోడానికి బ్యాంకులు తగిన ప్రయత్నం అంతా చేస్తాయని, విచారణా సంస్థలు తమ దర్యాప్తును వేగవంతం చేస్తాయని జైట్లీ స్పష్టం చేశారు.
దాదాపు రూ.900 కోట్ల ఐడీబీఐ రుణ ఎగవేత కేసులో భారత్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ విజ్ఞప్తి మేరకు భారత విదేశాంగశాఖ ఆయన పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. వెన్వెంటనే ముంబై ప్రత్యేక కోర్టు ఆయనపై నాన్-బెయిలబుల్ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రూ.9,200 కోట్ల బ్యాంకింగ్ కన్సార్షియం రుణ ఎగవేత కేసులో సుప్రీం ఆదేశాల మేరకు తన, తన కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను సీల్డ్‌కవర్‌లో తెలియజేసిన మాల్యా, దేశానికి వచ్చే విషయంలో మాత్రం ఎటువంటి సూచనా చేయలేదు. తాను దేశానికి వచ్చిన మరుక్షణం తీహార్ జైలుకు పంపిస్తారన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు. సుప్రీం ఆదేశాల ప్రకారం 2 నెలల్లో ఆయనపై బ్యాంకింగ్ రికవరీ కేసులను బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ పరిష్కరించాల్సి ఉంది.
ఆస్తుల జప్తునకు ఈడీ కసరత్తు
విజయ్‌మాల్యాపై కేసుల దర్యాప్తులో భాగంగా దేశంలో ఆయనకు సంబంధించిన దాదాపు రూ.9,000 కోట్ల విలువైన ఆస్తులు, షేర్లను జప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) యోచిస్తోంది. ఈ మేరకు తగిన చర్యలకు ఈడీ ఇప్పటికే శ్రీకారం చుట్టినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. వివిధ కంపెనీల్లో షేర్ల జప్తు విషయంపై మార్కెట్ రెగ్యులేటర్ సెబీని కూడా సంప్రదించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. బంగ్లాలు, విలువైన వాహనాలు, బ్యాంక్ బ్యాలెన్స్‌సహా ఆయనకు సంబంధించి స్థిర, చర ఆస్తుల వివరాలను అన్నింటినీ ఈడీ మదింపు చేసినట్లు సమాచారం. చార్జ్‌షీటు దాఖలుకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నందున, తొలుత ఆస్తుల జప్తుపై ముందడుగు వేయాలని ఈడీ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రైవేటు జెట్ వేలం వాయిదా: ఇదిలాఉండగా, ముంబై విమానాశ్రయంలో ల్యాండ్‌చేసిన విజయ్‌మాల్యా వ్యక్తిగత జెట్ వేలాన్ని సేవల పన్ను శాఖ జూన్ 29-30 తేదీలకు వాయిదా వేసింది. మే 12-13 తేదీల్లో ఈ వేలం జరగాల్సి ఉంది. మాల్యా నిర్వహించిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి రూ.535 కోట్ల సేవల పన్ను బకాయిలు రాబట్టుకునే ప్రయత్నంలో భాగంగా ఆ శాఖ ఈ జెట్ వేలం నిర్ణయం తీసుకుంది. అయితే కేవలం ఒకేఒక్క బిడ్డర్ ముందుకు రావడంతో వేలం ప్రక్రియ వాయిదా పడినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఒక్క బిడ్డర్ సైతం నిర్ణీత గడువులోపల రూ. కోటి డిపాజిట్ చేయలేదని కూడా ఆ వర్గాలు వెల్లడించాయి.