ఇప్పటికే ముగిసిన లీజు గడువు
కోర్టును ఆశ్రయించిన వ్యాపారులు
వారం పాటు ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న కోర్టు
నెహ్రూనగర్: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కొల్లి శారదా హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌లో ఉన్న షాపుల లీజు కాలపరిమితి ముగియడంతో గత కొద్ది రోజుల క్రితం గుంటూరు నగరపాలక సంస్థ అధికారులు షాపుల స్వా«దీనానికి నోటీసులిచ్చారు. దీని విషయమై లీజుదారులు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు వారం పాటు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశాలిచ్చింది.
13వ తేదీలోగా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు అందజేయాలని పేర్కొంది. కొల్లి శారదా మార్కెట్‌లో 1999లో 88 షాపులు నిర్మించారు. 25 ఏళ్ల లీజుతో షాపులను లీజుదారులకు అప్పగించారు. ఇటీవల గడువు ముగియడంతో వాటి స్వా«దీనానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే ఆ షాపులను కాపాడుకునేందుకు లీజుదారులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆ ప్రాంతం బస్టాండ్ దగ్గరలో ఉండటం.. అదీగాక హోల్‌సేల్ మార్కెట్ కావడంతో రైతుల క్రయ, విక్రయాలు, వినియోగదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది. అక్కడ రోజుకు కొన్ని రూ.లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే వ్యాపారులు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా, కొంత మంది రెవెన్యూ అధికారులే లీజు దారుల నుంచి పెద్ద మొత్తంలో ముడుపులు తీసుకుని అడ్డదారిలో షాపుల నిర్వహణకు సంబంధించి లూప్ హోల్స్ చెప్పి.. ఆ షాపులను నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకోకుండా అడ్డుపడుతున్నారనే ఆరోపణలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment