ఉత్తరాంధ్ర ప్రాంతంపై అధిక పీడన ద్రోణి
ఆపై పుంజుకోనున్న రుతుపవనాలు
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రల్లో ప్రభావం చూపుతున్న నైరుతి రుతుపవనాలు ఉత్తరాంధ్రకు వచ్చేసరికి ఒకింత మందగమనంలో ఉన్నాయి. దీంతో ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రంలో ఆ రెండు ప్రాంతాల్లో చెప్పుకోదగిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక ఒక్కోసారి ఉపరితలంలో అధిక పీడన ద్రోణి (రిడ్జ్) ఏర్పడుతుంటుంది.
ఇది అల్పపీడన ద్రోణికి విరుద్ధం. అంటే అల్పపీడన ద్రోణి ఏర్పడినప్పుడు ఉపరితలంలో గాలులు గడియారపు ముల్లు తిరిగే దిశ (క్లాక్ వైజ్ డైరెక్షన్)లో తిరుగుతూ మేఘాలు, వర్షాలకు కారణమవుతాయి. అదే అధిక పీడన ద్రోణి ఏర్పడితే గాలులు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్‌లో తిరుగుతాయి. ఫలితంగా అరకొర మేఘాలు ఏర్పడడమే కాకుండా సూర్యరశ్మి నేరుగా కిందకు ప్రసరిస్తుంది. దీంతో ఉష్ణతీవ్రత పెరగడంతో పాటు వర్షాలకు అడ్డంకులేర్పడతాయి.
ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి కొనసాగుతోందని ఆంధ్రా విశ్వవిద్యాలయం వాతావరణం, సముద్ర అధ్యయన విభాగం మాజీ అధిపతి ప్రొఫెసర్ ఓఎస్‌ఆర్‌యూ భానుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. దీనివల్ల విజయనగరం వరకు విస్తరించిన రుతుపవనాలు చురుకుదనం సంతరించుకోకుండా స్తబ్దుగా ఉన్నాయన్నారు.
దీని ఫలితంగా రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నా.. ఉత్తరాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి జల్లులే పడుతున్నాయని తెలిపారు. పైగా ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతున్నాయన్నారు. మరో రెండు మూడు రోజుల్లో అధిక పీడన ద్రోణి బలహీనపడుతుందని చెప్పారు. ఆ తర్వాత రుతుపవనాలు పుంజుకుంటాయని.. దీంతో మళ్లీ వర్షాలు ఊపందుకుంటాయని వివరించారు.
మూడు రోజులపాటు వర్షాలు..
మరోవైపు రానున్న మూడు రోజులు రాయలసీమ, కోస్తాంధ్రల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. సోమవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
మంగళవారం అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే బుధవారం ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది.
అలాగే అల్లూరి, పల్నాడు, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఆస్కారం ఉందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment